హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆట అభివృద్ధి కోసం తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) పాటుపడుతోందని టీసీఏ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అలాంటి సంఘం సేవలను గుర్తించకపోగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేకానంద ఎద్దేవా చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్యదర్శి గురువారెడ్డితో కలసి ఆయన మాట్లాడుతూ గడిచిన 60 ఏళ్లుగా నగరం మినహా తెలంగాణ జిల్లాల వైపు కన్నెత్తి చూడని హెచ్‌సీఏకు టీసీఏ అంటే ఏంటో తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీసీఏ గురించి తనకు తెలియదని వివేక్ అనడం కనులుండి చూడలేని గుడ్డితనమని అన్నారు.
తీవ్ర అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న హెచ్‌సీఏ తమ ఉనికిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. హెచ్‌సీఏ పెద్దలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని లక్ష్మీనారాయణ సవాలు విసిరారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయడం తప్ప క్రికెట్ కోసం హెచ్‌సీఏ వెలగబెట్టిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క క్రికెటరైనా ఎంపిక కాలేదని... చివరికి రంజీల్లోనూ తెలంగాణ ఆటగాళ్లు లేకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రతిభను పక్కనబెట్టి డబ్బే పరమార్థంగా హెచ్‌సీఏ వ్యవహరించిందని విమర్శించారు. టీసీఏ ఇప్పటివరకు 860 లీగ్, నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించిందని వెల్లడించారు.