TCA
-
US : ఆస్టిన్ తెలుగు సంఘానికి కొత్త కార్యవర్గం
అమెరికా టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో 2024కి గాను తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) నూతన కార్యవర్గం ఏర్పాటయింది. రౌండ్ రాక్ విన్గేట్ బై విందామ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఆస్టిన్ తెలుగు కమ్యూనిటీ ప్రకటించింది. తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) కార్యవర్గం వివరాలు అధ్యక్షుడు : పరమేశ్వర రెడ్డి నంగి ఉపాధ్యక్షుడు : శ్రీని బైరపనేని సెక్రెటరీ : భరత్ పిస్సాయ్ ట్రెజరర్ : చిన్నపరెడ్డి కుందూరు సంయుక్త కార్యదర్శులు : కల్చరల్ : ప్రతిభ నల్ల ఫైనాన్స్ & స్పాన్సర్షిప్ : లక్ష్మీకాంత్ ఫుడ్ & లాజిస్టిక్స్ : వెంకటేష్ దూబాల మెంబర్షిప్ & టెక్నాలజీ : శ్రీలత అంబటి స్పోర్ట్స్ : సర్వేశ్వరా రెడ్డి పాశం బోర్డు అఫ్ డైరెక్టర్లు : అర్జున్ అనంతుల గిరి మేకల బ్రహ్మేంద్ర రెడ్డి లాక్కుని గత కార్యవర్గంలో సేవలందించిన రామ్ హనుమంతు మల్లిరెడ్డి,మురళీధర్ రెడ్డి వేలూరు, శ్రీనివాస్ బత్తుల మరియు ఇతర TCA సభ్యులకు కొత్త కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. అమెరికాలోని తెలుగు సమాజానికి, ప్రవాసాంధ్రులకు మరిన్ని సేవలందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపింది. -
టొరంటోలో తీన్మార్ సంక్రాంతి ఘన వేడుకలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి 2022 సాంస్కృతిక ఉత్సవాలు కెనడాలోని టొరంటోలో ఘనంగా జరుపుకున్నారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ సంబరాలలో 200 పైగా కెనడాలో ఉన్న తెలంగాణ వాసులు పాల్గొన్నారు. టీసీఏ సహాయ కార్యదర్శి జితేందర్ ఆయన భార్య కాంతిలు జ్యోతి ప్రజ్వాలన చేసి తీన్మార్ సంక్రాంతి 2022 సంబరాలను ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సహకరించి కెనడాలో సంక్రాతి సంబరాలను ఘనంగా నిర్వర్తించారు ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ కార్యనిర్వాహాక కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఫౌండేషన్ కమిటీ సభ్యులు సహకారం అందించారు. ఈ కార్యక్రమములో భోగి పళ్ళు, పిల్లలు సంప్రదాయ వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు, ఈ ముగ్గుల పోటీలకు ఉమా సలాడి, జయ కందివనం న్యాయనిర్థేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా కన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ పాల్గొన్నారు. టీసీఏ 2022 క్యాలెండరును ఆమె ఆవిష్కరించారు. టీసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కమ్యూనిటీ సర్వీస్‌లను ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా రాజేష్, ప్రెసిడెంట్ టొరంటో కెనడా తెలంగాణ అసోసియేషన్ మాట్లాడుతూ... ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన భారత సంప్రదాయాలను బలోపేతం చేయాలని కోరారు. ప్రవాస భారతీయ సంస్కృతి సంరక్షణ లో భాగం కావాలని కోరారు. -
‘కోచ్‌లను, క్రికెటర్లను వేధిస్తున్నారు’
హైదరాబాద్: ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సభ్యత్వం కోరుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలోని మారుమూల జిల్లాల క్రికెటర్లకు తగిన అవకాశాలు కల్పించేలా తమ అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై మరొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీసీఏ సభ్యులు.. తమకు జూన్‌లో అసోసియేటివ్ మెంబర్షిప్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అసోసియేషన్‌కు ముంబై హైకోర్టులు అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతిని టీసీఏ సెక్రటరీ గురువా రెడ్డి మరోసారి గుర్తు చేశారు. 2014 నుంచి జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏ కృషి చేస్తుందన్నారు. వచ్చే దేశవాళీ సీజన్లో టీసీఏ జట్లు కూడా పాల్గొంటాయన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధే లక్ష్యంగా టీసీఏను ఏర్పాటు చేశామన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదనే విషయాన్ని హెచ్‌సీఏ తెలుసుకోవాలన్నారు. జిల్లాల్లో కోచ్‌లను, క్రికెటర్లను హెచ్‌సీఏ వేధిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమని బెదిరించే బదులు.. క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని హెచ్‌సీఏకు హితవు పలికారు. తమకు వచ్చే నిధులను తాము తీసుకుంటామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా.. జిల్లా క్రికెటర్ల కోసం హెచ్‌సీఏ లీగ్‌లు ఏర్పాటు చేస్తుందని, ఇలా పెడుతూ వారి పని వారు చూసుకుంటే మంచిదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటగాళ్ల కోసం వేలల్లో మ్యాచ్‌లు నిర్వహించామని.. ఇకపై కూడా నిర్వహిస్తూనే ఉంటామన్నారు. శరద్ పవార్, వినోద్ రాయ్, రాజీవ్ శుక్లాలతో తాము మాట్లాడమని, వారంతా తమకు అనుకూలంగా స్పందించినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే హెచ్‌సీఏపై ఎన్నో కేసులున్నాయని, వారు చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. టీసీఏ ప్రెసిడెంట్ ఎండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 2016, 17ల్లో టీసీఏ సభ్యత్వం కోసం బీసీసీఐకి వినతిపత్రాలు ఇచ్చామన్నారు. బీసీసీఐ స్పందించని కారణంగా ముంబై హైకోర్టుకు వెళ్లామన్నారు. దీనిపై తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఇది తెలంగాణ క్రికెటర్లకు శుభపరిణామంగా ఎండెల తెలిపారు. దీన్ని హెచ్‌సీఏ స్వాగతించాలే తప్పా.. కానీ ఆటగాళ్లను వేధిస్తోందన్నారు. తమకు సభ్యత్వం ఇవ్వొద్దని హెచ్‌సీఏ.. బీసీసీఐ లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలా చేస్తే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లేనని ఆయన మండిపడ్డారు. -
క్రికెట్ అభివృద్ధికి హెచ్‌సీఏ ఏం చేసింది?
హైదరాబాద్: క్రికెట్ అభివృద్ధి కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తీసుకున్న చర్యలేమిటో వివరించాలని ‘ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎ.లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ కార్యదర్శి గురువారెడ్డితో కలిసి హెచ్‌సీఏపై ధ్వజమెత్తారు. వివేక్ దిగిపోవాలని వారి కమిటీ సభ్యులే డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే క్రికెట్ కోసం ఏం చేశారో వివరించాలని హెచ్‌సీఏను బీసీసీఐ కోరడంతో ఏం తోచని సందిగ్ధావస్థలో ఉన్నారని ఆరోపించారు. టీటీఎల్ను నిర్వహించే హక్కు వివేక్‌కు లేదని పేర్కొన్నారు. టీటీఎల్‌లో తెలంగాణ వారు చాలా తక్కువ మంది ఉన్నారన్న లక్ష్మీనారాయణ డబ్బులు తీసుకొని ఆ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వివేక్ బినామీ పేర్ల మీద క్రికెట్ క్లబ్‌లు నడుపుతున్నారని, త్వరలో అన్నీ బయట పడతాయని దుయ్యబట్టారు. -
హెచ్‌సీఏపై నిప్పులు చెరిగిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోథా సిఫార్సులను హెచ్‌సీఏ అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్ విమర్శించారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంతో మాట్లాడుతూ...‘ నేను రాజకీయంగా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశానని క్రికెటర్‌గా యూపీ నుంచి రిజిస్ట్రర్ ఎలా చేసుకుంటాను. హెచ్‌సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోంది. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20 లీగ్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్‌కు వివేక్ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్‌సీఏ లోగోతో వివేక్ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇక బీసీసీఐ నుంచి నాకు క్లియరెన్స్ రాలేదని ఆరోపించారు. కానీ నాకు హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీనిపై నేను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తప్పు చేశారు. చదువుకున్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై నేను చట్టపరంగా ముందుకు వెళతా. నాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయితే నన్ను ఓ సెలబ్రెటీగా అందరూ ఆహ్వానిస్తారు’ అని తెలిపారు. -
'వివేక్ వెంటనే రాజీనామా చేయాలి'
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదకి జి. వివేక్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ హెచ్‌సీఏలో కొనసాగడానికి ఎంతమాత్రం అర్హత లేదన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇచ్చే విషయంలో అడ్డుకుంటామని వివేక్ స్వయంగా చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు. ఇలా చెప్పడం తెలంగాణ యువతను క్రికెట్ దూరం చెయ్యడం కాదా.. అని అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత టీసీఏ..బీసీసీఐ అనుమతి కోసం యత్నంచడంలో తప్పేముందని అరుణ నిలదీశారు. ఈ సందర్భంగా టీసీఏను 1986లో పాల్వాయి గోవర్ధన్ స్థాపించిన సంగతిని గుర్తు చేశారు. అదే సమయంలో హెచ్‌సీఏ ఏనాడూ గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ నిర్వహించి, ప్రోత్సహకాలు అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా హెచ్‌సీఏ గ్రామాల్లోకి వెళ్లిన దాఖలాలు లేవని మండిపడ్డారు. టీసీఏపై హెచ్‌సీఏ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని అనడానికి వివేక్ వ్యాఖ్యలు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. హెచ్‌సీఏపై లెక్కలేనటువంటి ఆరోపణలున్నాయని, రూ. 140 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీలో కేసులో ఉన్నాయన్నారు. ఇక్కడ జరపని టోర్నమెంట్లను జరిపినట్లు చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. ఇదిలా ఉంచితే, తెలంగాణలో మహిళా క్రికెటర్లకు ఎంతమాత్రం ప్రోత్సాహం లేదని, దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల యువతి, యువకులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు టీసీఏ కంకణం కట్టుకుని పనిచేస్తోందన్నారు. హెచ్‌సీఏలో వివేక్ కుటుంబ పాలన కొనసాగిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. హెచ్‌సీఏ అవినీతిపై అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తామని హెచ్చరించిన అరుణ.. హెచ్‌సీఏలో ఏమి జరిగినా జవాబు చెప్పాల్సిన బాధ్యత వివేక్‌పై ఉందన్నారు. టీసీఏకి త్వరలో బిసిసిఐ అనుమతి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీసీఏ కి వస్తున్న ఆదరణ ఓర్వలేక వివేక్ ఆరోపణలకు దిగుతున్నారని అరుణ ఆరోపించారు. హెచ్‌సీఏలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న వివేక్ దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేయాలన్నారు. -
అజారుద్దీన్‌కు బ్రేక్.. మైక్‌ను నేలకు కొట్టిన వీహెచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సహనం కోల్పోయారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన వీహెచ్.. సమావేశంలో మైక్‌ను నేలకేసి కొట్టారు. హెచ్‌సీఏ కార్యాలయంలో ఆదివారం హెచ్‌సీఏ ప్రత్యేక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అజారుద్దీన్‌ను సిబ్బంది అడ్డుకోవడంతో వీహెచ్ ఆగ్రహంగా స్పందించారు. ఇదేమైనా టీఆర్ఎస్ మీటింగ్ అనుకుంటున్నావా.. అని టీఆర్ఎస్ నేత, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్‌పై మండిపడ్డారు. ఈ సందర్భంగా వివేక్ స్పందిస్తూ..లోథా కమిటీ ఆదేశాల అమలు కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మీటింగ్‌లో ఇంతకుముందు అమలైన 16 అంశాలపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు అజారుద్దీన్ మద్దతిస్తున్నారని తెలిసిందని, అందుకే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అజారుద్దీన్ పై తమకు చాలా గౌరవం ఉందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధులు లేవని, అండర్-14 నిర్వహించడానికి కూడా నిధులు లేకపోతే ఇతరుల దగ్గర నుంచి నిధులు తెచ్చి నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్‌సీఏ లోథా సిఫార్సులన్నింటినీ అమలు చేస్తుందని వివేక్ చెప్పారు. హనుమంత రావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. టీసీఏ వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. అజారుద్దీన్ తెలంగాణ క్రికెట్ అసోషియేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారని వార్తలు వచ్చినందుకు ఆయన్ని మీటింగ్‌కు రానివ్వలేదని వివేక్ స్పష్టం చేశారు. -
కెనడాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మిస్సిస్సౌగ : తెలంగాణ కెనడా సంఘం(టీసీఏ)ఆధ్వర్యంలో మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్ సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలని ఘనంగా జరిగాయి. ఈ సంబురాల్లో దాదాపు500లకు పైగా కెనడాలోని తెలంగాణ వాసులు పాల్గొన్నారు. అతిథులను కార్యదర్శి రాధిక బెజ్జంకి సాదరంగా ఆహ్వానించగా, అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి సభ ప్రారంభానికి జెండా ఊపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సభకువిచ్చేసిన వారందరు అమరవీరులను స్మరిస్తూ కొద్ది సేపు మౌనం పాటించారు. తర్వాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా అధ్యక్షులు శ్రీధర్ బండారు విచ్చెసి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడాలోని తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కెనడా తెలంగాణ జాగృతికి ప్రథమ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు రమేశ్ మునుకుంట్ల, ఆయన భార్య ధనలక్ష్మి మునుకుంట్లను కమీటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో సాగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 6 గంటలపాటుసభికులను అలరించాయి. పోతరాజు వేషం, లష్కర్ బోనాల ఊరేగింపు, పీరీల ప్రదర్శన సభికులందర్ని విశేషంగా ఆకర్శించాయి. సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి ఆధ్వర్యంలో ట్రస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి, ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, సెక్రటరీ రాధిక బెజ్జంకి, కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం, ట్రెజరర్ సంతోష్ గజవాడ, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, దామోదర్ రెడ్డి మాది, మురళి కాందివనం, భారతి కైరోజు, మల్లికార్జున్ మదపు, ట్రస్టీలు సమ్మయ్య వాసం, శ్రీనివాస్ తిరునగరి, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, నవీన్ రెడ్ది సూదిరెడ్ది, హరి రావుల, అఖిలేశ్ బెజ్జంకి, వేణురోకండ్ల, ఇతర వాలంటీర్సు సహకారంతో ఈ వేడుకలను విజవంతంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా స్నిగ్ద గుల్లపల్లి, మనస్విణి బెజ్జంకి, ఐశ్వర్య ఈద, మేఘ స్వర్గంలు వ్యవహరించారు. -
క్రికెట్ అభివృద్ధికే టీసీఏ
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆట అభివృద్ధి కోసం తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) పాటుపడుతోందని టీసీఏ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అలాంటి సంఘం సేవలను గుర్తించకపోగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేకానంద ఎద్దేవా చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్యదర్శి గురువారెడ్డితో కలసి ఆయన మాట్లాడుతూ గడిచిన 60 ఏళ్లుగా నగరం మినహా తెలంగాణ జిల్లాల వైపు కన్నెత్తి చూడని హెచ్‌సీఏకు టీసీఏ అంటే ఏంటో తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీసీఏ గురించి తనకు తెలియదని వివేక్ అనడం కనులుండి చూడలేని గుడ్డితనమని అన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న హెచ్‌సీఏ తమ ఉనికిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. హెచ్‌సీఏ పెద్దలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని లక్ష్మీనారాయణ సవాలు విసిరారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయడం తప్ప క్రికెట్ కోసం హెచ్‌సీఏ వెలగబెట్టిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క క్రికెటరైనా ఎంపిక కాలేదని... చివరికి రంజీల్లోనూ తెలంగాణ ఆటగాళ్లు లేకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రతిభను పక్కనబెట్టి డబ్బే పరమార్థంగా హెచ్‌సీఏ వ్యవహరించిందని విమర్శించారు. టీసీఏ ఇప్పటివరకు 860 లీగ్, నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించిందని వెల్లడించారు.