సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సహనం కోల్పోయారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన వీహెచ్.. సమావేశంలో మైక్‌ను నేలకేసి కొట్టారు. హెచ్‌సీఏ కార్యాలయంలో ఆదివారం హెచ్‌సీఏ ప్రత్యేక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అజారుద్దీన్‌ను సిబ్బంది అడ్డుకోవడంతో వీహెచ్ ఆగ్రహంగా స్పందించారు. ఇదేమైనా టీఆర్‌ఎస్ మీటింగ్ అనుకుంటున్నావా.. అని టీఆర్‌ఎస్ నేత, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్‌పై మండిపడ్డారు.
ఈ సందర్భంగా వివేక్ స్పందిస్తూ..లోథా కమిటీ ఆదేశాల అమలు కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మీటింగ్‌లో ఇంతకుముందు అమలైన 16 అంశాలపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు అజారుద్దీన్ మద్దతిస్తున్నారని తెలిసిందని, అందుకే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అజారుద్దీన్ పై తమకు చాలా గౌరవం ఉందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధులు లేవని, అండర్-14 నిర్వహించడానికి కూడా నిధులు లేకపోతే ఇతరుల దగ్గర నుంచి నిధులు తెచ్చి నిర్వహించామని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్‌సీఏ లోథా సిఫార్సులన్నింటినీ అమలు చేస్తుందని వివేక్ చెప్పారు. హనుమంత రావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. టీసీఏ వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. అజారుద్దీన్ తెలంగాణ క్రికెట్ అసోషియేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారని వార్తలు వచ్చినందుకు ఆయన్ని మీటింగ్‌కు రానివ్వలేదని వివేక్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment