హైదరాబాద్: ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సభ్యత్వం కోరుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలోని మారుమూల జిల్లాల క్రికెటర్లకు తగిన అవకాశాలు కల‍్పించేలా తమ అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
దీనిపై మరొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీసీఏ సభ్యులు.. తమకు జూన్‌లో అసోసియేటివ్ మెంబర్‌షిప్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అసోసియేషన్‌కు ముంబై హైకోర్టులు అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతిని టీసీఏ సెక్రటరీ గురువా రెడ్డి మరోసారి గుర్తు చేశారు. 2014 నుంచి జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏ కృషి చేస‍్తుందన్నారు. వచ్చే దేశవాళీ సీజన్‌లో టీసీఏ జట్లు కూడా పాల్గొంటాయన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధే లక్ష్యంగా టీసీఏను ఏర్పాటు చేశామన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదనే విషయాన్ని హెచ్‌సీఏ తెలుసుకోవాలన్నారు. జిల్లాల్లో కోచ్‌లను, క్రికెటర్లను హెచ్‌సీఏ వేధిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమని బెదిరించే బదులు.. క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని హెచ్‌సీఏకు హితవు పలికారు. తమకు వచ్చే నిధులను తాము తీసుకుంటామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా.. జిల్లా క్రికెటర్ల కోసం హెచ్‌సీఏ లీగ్‌లు ఏర్పాటు చేస్తుందని, ఇలా పెడుతూ వారి పని వారు చూసుకుంటే మంచిదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటగాళ్ల కోసం వేలల్లో మ్యాచ్‌లు నిర్వహించామని.. ఇకపై కూడా నిర్వహిస్తూనే ఉంటామన్నారు. శరద్ పవార్, వినోద్ రాయ్, రాజీవ్ శుక్లాలతో తాము మాట్లాడమని, వారంతా తమకు అనుకూలంగా స్పందించినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప‍్పటికే హెచ్‌సీఏపై ఎన్నో కేసులున్నాయని, వారు చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు.
టీసీఏ ప్రెసిడెంట్ ఎండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 2016, 17ల్లో టీసీఏ సభ్యత్వం కోసం బీసీసీఐకి వినతిపత్రాలు ఇచ్చామన్నారు. బీసీసీఐ స్పందించని కారణంగా ముంబై హైకోర్టుకు వెళ్లామన్నారు. దీనిపై తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఇది తెలంగాణ క్రికెటర్లకు శుభపరిణామంగా ఎండెల తెలిపారు. దీన్ని హెచ్‌సీఏ స‍్వాగతించాలే తప్పా.. కానీ ఆటగాళ్లను వేధిస్తోందన్నారు. తమకు సభ్యత్వం ఇవ్వొద్దని హెచ్‌సీఏ.. బీసీసీఐ లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలా చేస్తే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లేనని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment