మళ్లీ ధోని సేనదే విజయం | team india beats Western Australia by 64 runs in warmup one day | Sakshi
Sakshi News home page

మళ్లీ ధోని సేనదే విజయం

Published Sat, Jan 9 2016 7:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

మళ్లీ ధోని సేనదే విజయం

మళ్లీ ధోని సేనదే విజయం

పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లోనూ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా ఘనవిజయం సాధించింది.  శనివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా విసిరిన 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తడబడింది. కార్డర్(45),జోరాన్ మోర్గాన్(50) మినహా మిగతా ఎవరూ రాణించకపోవడంతో యువ ఆసీస్ జట్టు 49.2 ఓవర్లలో 185 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, రిషి ధవన్, అశ్విన్, అక్షర్ పటేల్లకు తలో రెండు వికెట్లు లభించగా, ఉమేష్ యాదవ్, గుర్ కీరత్ సింగ్లకు చెరో  వికెట్ దక్కింది.


 అంతకుముందు  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా  49.1ఓవర్లలో 249 పరుగులకు పరిమితమైంది.  ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధవన్(4), విరాట్ కోహ్లి(7) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినా.. రోహిత్ శర్మ-అజింక్యా రహానేల జోడీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. కాగా, రహానే(41) మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో టీమిండియా మరోసారి తడబడినట్లు కనిపించింది. అయితే  రోహిత్ శర్మ (67; 82 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) , మనీష్ పాండే(58; 59 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయకల్గింది. టీమిండియా మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించినా, ధోని(15), గుర్కీరత్ సింగ్ (6), అశ్విన్(4) లు నిరాశపరిచారు. శుక్రవారం ఇదే స్టేడియంలో జరిగిన ట్వంటీ 20 వార్మప్ మ్యాచ్ లో  టీమిండియా 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ తో వన్డే సిరీస్ కు ముందు ధోని సేన మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఐదు వన్డేల సిరీస్ లో తొలి వన్డే మంగళవారం జరుగనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement