
శతకాలతో చెలరేగిన కోహ్లీ, విజయ్
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. తొలి రోజు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఓపెనర్ రాహుల్(2)ను బంగ్లా బౌలర్ టస్కీన్ అహ్మద్ ఔట్ చేశాడు.
అనంతరం క్రీజులోకొచ్చిన చతేశ్వర్ పుజారా(83)తో కలిసి మరో ఓపెనర్ మురళీ విజయ్ ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు. రెండో వికెట్ కు భారీ సెంచరీ భాగస్వామ్యాన్ని (178 పరుగులు) అందించిన తర్వాత పుజారాను హసన్ మిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ సాధించిన విజయ్(108, 160 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్స్) ఆ కొద్దిసేపటికే తైజుల్ ఇస్లామ్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. కోహ్లీ సేన టీ విరామానికి 2 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
టీ బ్రేక్ తర్వాత కోహ్లీ హవా!
టీ సమయానికి 17 పరుగులతో ఉన్న కోహ్లీ బ్రేక్ అనంతరం వేగాన్ని పెంచాడు. 96 పరుగుల వద్ద కోహ్లీ ఫోర్ కొట్టి టెస్టు కెరీర్లో 16వ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. 130 బంతుల్లో కోహ్లీ సెంచరీ సాధించాడు. విజయ్ ఔటయ్యాక రహానే(45 నాటౌట్)తో కలిసి కోహ్లీ (111 నాటౌట్, 141 బంతుల్లో 12 ఫోర్లు) పరుగుల వేగాన్ని పెంచేశాడు. కోహ్లీ-రహానే జోడీ కేవలం 26.2 ఓవర్లలో 4.63 రన్ రేట్తో నాలుగో వికెట్కు సెంచరీ (122 పరుగులు) భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో తొలి రోజు నిర్ణీత ఓవర్లలో ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో టస్కీన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్, హసన్ మిరాజ్ తలో వికెట్ తీశారు.