ముంబై: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీం ఇండియా ఆటగాళ్లు ఆదివారం న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ భారత్ జట్టు ఐదు వన్డే మ్యాచ్ లు, రెండు టెస్టు మ్యాచ్ ల్లో పాల్గొననుంది. జనవరి 19 నుంచి జరిగే పరిమిత ఓవర్ల వన్డే మ్యాచ్ లు ఆరంభకానున్నాయి. అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు టీం ఇండియా వారం రోజులు ముందుగానే న్యూజిలాండ్ కు చేరుకుంది. జనవరి 19వ తేదీ నుంచి 31 వ తేదీ వరకూ వన్డే సిరీస్ జరుగనుంది.
జనవరి 19న నాపియర్ లో తొలి వన్డే, జనవరి 22న హమిల్టన్ లో రెండో వన్డే , జనవరి 25న అక్లాండ్ లోమూడో వన్డే, జనవరి 28న హమిల్టన్ లో నాలుగు వన్డే, జనవరి 31 వ తేదీన వెల్టింగ్టన్ లో ఐదో వన్డే జరుగనుంది. అనంతరం రెండు టెస్టుల మ్యాచ్ సిరీస్ ఆరంభకానుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10 వ తేదీ వరకూ ఆక్లాండ్ లో తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి 18 వరకూ వెల్టింగ్టన్ లో రెండో టెస్టు మ్యాచ్ ఆరంభమవుతుంది. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.ఇప్పటి వరకూ భారత్ 9సార్లు న్యూజిలాండ్ లో పర్యటించింది.
టీం ఇండియా వన్డే సభ్యులు..
మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ థావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింకా రహేనా, అంబటి రాయుడు, సురేష్ రైనా, అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సమీ, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఈశ్వర్ పాండే, స్టువార్ట బిన్నీ, వరణ్ ఆరూన్.