సెల్ఫీ కోసం ధోనీ కారుకు అడ్డంపడి..!
రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి దేశమంతట అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. బహిరంగంగా కనిపించినా అభిమానులు పెద్దసంఖ్యలో చుట్టుముడతారు. ఇక స్వస్థలం రాంచీలో కూడా ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో ఓ అభిమాని ధోని వాహనానికి అడ్డం పడి.. కాసేపు హల్‌చల్ చేసింది. తన వాహనం హమ్మర్‌లో ధోనీ ఇంటికి వెళుతుండగా.. సెల్ఫీ లేదా ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఆయన వాహనాన్ని ఆపేసింది.
కోల్‌కతాలో జార్ఖండ్ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ధోనీ.. తమ రాష్ట్ర జట్టుతో కలిసి విమానంలో మంగళవారం రాంచీకి తిరిగొచ్చాడు. అదే విమానంలో ప్రయాణించిన ఓ యువతి ధోనీని చూసి సంబరపడింది. విమానాశ్రయంలో దిగగానే ఆయనను వెంటాడింది. హమ్మర్ వాహనంలో ధోనీకి ఇంటికి వెళుతుండగా వాహనానికి అడ్డుపడింది. కానీ, ధోనీ వాహనం దిగి రాలేదు. వాహనానికి అడ్డంగా నిలబడిన ఆమెను విమానాశ్రయ సిబ్బంది బలవంతంగా అక్కడినుంచి తరలించారు. ఏదైనా రగడ జరుగుతుందా చూడడానికి మాత్రం ధోనీ ఈ సమయంలో కాస్తా తలెత్తి బయటకు చూశాడు. గతంలోనూ రాంచీలో ఓ అభిమాని ధోనీని ఇంటివరకు వెంటాడుతూ వచ్చింది. దీంతో ఆమె విన్నపాన్ని మన్నించిన ఆయన తనతో సెల్ఫీ దిగారు. ఈసారి మాత్రం ధోనీ అలాంటి ఔదార్యం చూపలేదు.