కోహ్లీకి సాధ్యంకాని ధోనీ రికార్డు
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ తక్కువ కాలంలోనే రాటుదేలాడు. టెస్టు క్రికెట్‌లో జట్టుకు ఘనవిజయాలు అందించాడు. బ్యాట్స్‌మన్‌గా అద్భుతాలు చేస్తున్నాడు. రికార్డుల దిశగా వెళ్తున్నాడు. కాగా కెప్టెన్‌గా ధోనీ నెలకొల్పిన రికార్డును కొనసాగించడంలో విఫలమయ్యాడు. టెస్టు క్రికెట్లో ధోనీ సారథ్యంలో భారత్ ఎప్పుడూ సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందలేదు. ఆస్ట్రేలియాతో ఎనిమిది టెస్టుల్లో ధోనీసేన విజయం సాధించింది. మూడు సిరీస్ లను సొంతం చేసుకుంది.
ఓవరాల్ గా విరాట్ సారథ్యంలో టీమిండియాకు 19 టెస్టుల్లో ఓటమెరుగని రికార్డు ఉంది. కాగా పుణెలో జరిగిన ఆసీస్‌తో తొలిటెస్టులో కోహ్లీ సేన చిత్తుగా ఓడింది. దీంతో ధోనీ కెప్టెన్సీ రికార్డును కోహ్లీ తిరగరాసే అవకాశం కోల్పోయాడు. 2008-09 సీజన్‌లో సొంతగడ్డపై ధోనీసేన ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడింది. ఈ సిరీస్‌ను భారత్ 2-0తో గెల్చుకుంది. 2010-11 సీజన్‌లోనూ ధోనీసేన ఇదే విజయాన్ని పునరావృతం చేసింది. ఇక 2012-13 సీజన్‌లో భారత్ 4-0తో కంగారూలను చిత్తుగా ఓడించింది.