ధోనీ స్థానంలో కోహ్లీ!
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా టెస్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో కూడా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనబడుతున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు వన్డేలు, మూడు ట్వంటీ 20 మ్యాచ్ లకు భారత సారథిగా ధోనీ స్థానంలో కోహ్లీని నియమించే అవకాశముంది. ఈ సిరీస్ కు ధోనీని పక్కకు పెట్టి విరాట్ ను కెప్టెన్ గా ఎంపిక చేసే యోచలో బీసీసీఐ పెద్దలు ఉన్నట్లు జాతీయ దినపత్రిక ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. సెప్టెంబర్ 15 వ తేదీన టీమిండియా జట్టును ఎంపిక చేయనుంది.
ఒకే జట్టుకు ఇద్దరు భిన్నమైన శైలి కల్గిన కెప్టెన్ లను ఎంపిక చేస్తే.. ఆ ప్రభావం ఆటగాళ్లపై పడుతుందనే భావనలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలిపింది. అందులో భాగంగానే విరాట్ ను దక్షిణాఫ్రికా పర్యటనకు కెప్టెన్ గా ఎంపిక చేయాలని సెలెక్టర్లు దృష్టి పెట్టినట్లు ఆ పత్రిక స్పష్టం చేసింది. దీంతో పాటు వచ్చే సంవత్సరం జరిగే ట్వంటీ 20 ప్రపంచకప్ వరకూ వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినివ్వాలని ఇప్పటికే బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. దీనిని బట్టి ధోనిని కేవలం పొట్టి ఫార్మెట్ కు పరిమితం చేసి.. వన్డే, టెస్టులకు కోహ్లిని కెప్టెన్ గా కొనసాగించే భావనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో విరాట్ నేతృత్వంలోని టీమిండియా ఘనవిజయం సాధించడం కూడా బీసీసీఐ పెద్దలను ఆలోచనలో పడేసినట్టు సమాచారం.