ధోనీ తర్వాత నువ్వే కెప్టెన్! | dada ganguly votes for virat kohli as captain after dhoni | Sakshi
Sakshi News home page

ధోనీ తర్వాత నువ్వే కెప్టెన్!

Published Tue, May 10 2016 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

ధోనీ తర్వాత నువ్వే కెప్టెన్!

ధోనీ తర్వాత నువ్వే కెప్టెన్!

ధోనీ.. వ్యూహాలు రచించడంలో దిట్ట. ధోనీ.. వికెట్ కీపింగ్‌లో నెంబర్ వన్. ధోనీ.. అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్.. ఇన్ని లక్షణాలున్నా.. అతడు ఎంతకాలం ఆడతాడు? మూడేళ్ల తర్వాత.. అంటే 2019లో జరగబోయే 50 ఓవర్ల ఐసీసీ ప్రపంచ కప్‌లో టీమిండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించడం అనుమానమేనంటున్నాడు క్రికెట్ దాదా.. సౌరవ్ గంగూలీ. అందుకే విరాట్ కోహ్లీని అందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నాడు. ప్రతి జట్టుకు భవిష్యత్ ప్రణాళిక ఉంటుందని, మూడు నాలుగేళ్ల తర్వాత కూడా ధోనీ కెప్టెన్‌గా ఉంటాడా అని సెలెక్టర్లకు దాదా సూటి ప్రశ్న వేశాడు. ధోనీ నాయకత్వం గురించి గంగూలీ ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు కానీ, క్రమంగా అతడు తన బాధ్యతలను వేరే వాళ్లకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నం అవుతోందని సూచించాడు. ఆ స్థానానికి విరాట్ కోహ్లీ అయితేనే సరిగ్గా సరిపోతాడన్నది దాదా అంచనా. ధోనీ తొమ్మిదేళ్లు కెప్టెన్‌గా ఉన్నాడని, అదేమీ తక్కువ సమయం కాదని గంగూలీ చెప్పాడు. ఇప్పటికే అతడు టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడని, కేవలం వన్డేలు, టి20లు మాత్రమే ఆడుతున్నాడని గుర్తుచేశాడు. ఇంకో నాలుగేళ్ల పాటు ఇంతే సామర్థ్యం ఉంటుందని ఎలా చెప్పగలమన్నాడు.

కోహ్లీని ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనాతో గంగూలీ పోల్చాడు. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్న కోహ్లీ.. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసింది, ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు చేసినది కూడా కోహ్లీయే. కోహ్లీ రోజు రోజుకూ బెటర్ అవుతున్నాడని, నిలకడ విషయంలో ఇప్పుడు ప్రపంచంలోనే అతడు బెస్ట్ అని దాదా ప్రశంసలు కురిపించాడు. అందువల్ల 2019 నాటికి ధోనీకి ప్రత్యామ్నాయం ఎవరనే విషయమై సెలెక్టర్లు ఆలోచించుకోవాలని.. వాళ్లు ఒకవేళ ధోనీనే కొనసాగించాలని అనుకుంటే మాత్రం తాను చాలా ఆశ్చర్యపోతానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement