india captaincy
-
ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు.. టీమిండియాకు ఏమైంది..?
గతేడాది కాలంగా టీమిండియా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 11 నెలల కాలంలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లు మారడంతో ఏ సిరీస్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటారో అర్ధం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. 2021 జూన్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరగా, అదే సమయంలో శిఖర్ ధవన్ సారధ్యంలో టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. అనంతరం అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల చేత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నుంచి విరాట్ కోహ్లి తప్పుకోగా ఆ మ్యాచ్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించారు. తదనంతరం కెప్టెన్సీ విషయంలో చెలరేగిన వివాదాల నేపథ్యంలో విరాట్ కోహ్లి టీమిండియా సారధ్య బాధ్యతల నుంచి మొత్తంగా తప్పుకోగా.. సౌతాఫ్రికా టూర్లో రెండో టెస్టుకు ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేయగా, సిరీస్ ప్రారంభానికి ముందే అతను గాయం కారణంగా వైదొలిగాడు. దీంతో బీసీసీఐ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌లో పర్యటించే భారత జట్టులో పంత్‌కు చోటు దక్కడంతో ఐర్లాండ్‌లో పర్యటించే మరో జట్టుకు హార్ధిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది బీసీసీఐ. ఇలా వివిధ కారణాల చేత 11 నెలల కాలంలో టీమిండియాకు ఏడుగురు కెప్టెన్లు మారారు. చదవండి: టీమిండియా ఇంగ్లండ్‌కు.. కేఎల్ రాహుల్ జర్మనీకి..! -
ధోనీ తర్వాత నువ్వే కెప్టెన్!
ధోనీ.. వ్యూహాలు రచించడంలో దిట్ట. ధోనీ.. వికెట్ కీపింగ్‌లో నెంబర్ వన్. ధోనీ.. అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్.. ఇన్ని లక్షణాలున్నా.. అతడు ఎంతకాలం ఆడతాడు? మూడేళ్ల తర్వాత.. అంటే 2019లో జరగబోయే 50 ఓవర్ల ఐసీసీ ప్రపంచ కప్‌లో టీమిండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించడం అనుమానమేనంటున్నాడు క్రికెట్ దాదా.. సౌరవ్ గంగూలీ. అందుకే విరాట్ కోహ్లీని అందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నాడు. ప్రతి జట్టుకు భవిష్యత్ ప్రణాళిక ఉంటుందని, మూడు నాలుగేళ్ల తర్వాత కూడా ధోనీ కెప్టెన్‌గా ఉంటాడా అని సెలెక్టర్లకు దాదా సూటి ప్రశ్న వేశాడు. ధోనీ నాయకత్వం గురించి గంగూలీ ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు కానీ, క్రమంగా అతడు తన బాధ్యతలను వేరే వాళ్లకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నం అవుతోందని సూచించాడు. ఆ స్థానానికి విరాట్ కోహ్లీ అయితేనే సరిగ్గా సరిపోతాడన్నది దాదా అంచనా. ధోనీ తొమ్మిదేళ్లు కెప్టెన్‌గా ఉన్నాడని, అదేమీ తక్కువ సమయం కాదని గంగూలీ చెప్పాడు. ఇప్పటికే అతడు టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడని, కేవలం వన్డేలు, టి20లు మాత్రమే ఆడుతున్నాడని గుర్తుచేశాడు. ఇంకో నాలుగేళ్ల పాటు ఇంతే సామర్థ్యం ఉంటుందని ఎలా చెప్పగలమన్నాడు. కోహ్లీని ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనాతో గంగూలీ పోల్చాడు. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్న కోహ్లీ.. ఇటీవల ముగిసిన టి20 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసింది, ఒకే సీజన్లో రెండు సెంచరీలు చేసినది కూడా కోహ్లీయే. కోహ్లీ రోజు రోజుకూ బెటర్ అవుతున్నాడని, నిలకడ విషయంలో ఇప్పుడు ప్రపంచంలోనే అతడు బెస్ట్ అని దాదా ప్రశంసలు కురిపించాడు. అందువల్ల 2019 నాటికి ధోనీకి ప్రత్యామ్నాయం ఎవరనే విషయమై సెలెక్టర్లు ఆలోచించుకోవాలని.. వాళ్లు ఒకవేళ ధోనీనే కొనసాగించాలని అనుకుంటే మాత్రం తాను చాలా ఆశ్చర్యపోతానని చెప్పాడు.