Seven Captains Changed For Team India In One Year, Know Details Inside - Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు.. టీమిండియాకు ఏమైంది..?

Published Thu, Jun 16 2022 9:11 PM | Last Updated on Fri, Jun 17 2022 8:49 AM

Seven Captains Changed For Team India In One Year - Sakshi

గతేడాది కాలంగా టీమిండియా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 11 నెలల కాలంలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లు మారడంతో ఏ సిరీస్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటారో అర్ధం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. 2021 జూన్‌లో విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరగా, అదే సమయంలో శిఖర్‌ ధవన్‌ సారధ్యంలో టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడింది. 

అనంతరం అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్‌ కోహ్లి పొట్టి ఫార్మాట్‌ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల చేత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకోగా ఆ మ్యాచ్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించారు. 

తదనంతరం కెప్టెన్సీ విషయంలో చెలరేగిన వివాదాల నేపథ్యంలో విరాట్‌ కోహ్లి టీమిండియా సారధ్య బాధ్యతల నుంచి మొత్తంగా తప్పుకోగా.. సౌతాఫ్రికా టూర్‌లో రెండో టెస్టుకు ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. 

తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతినివ్వడంతో కేఎల్‌ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేయగా, సిరీస్‌ ప్రారంభానికి ముందే అతను గాయం కారణంగా వైదొలిగాడు. దీంతో బీసీసీఐ రిషబ్‌ పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌లో పర్యటించే భారత జట్టులో పంత్‌కు చోటు దక్కడంతో ఐర్లాండ్‌లో పర్యటించే మరో జట్టుకు హార్ధిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది బీసీసీఐ. ఇలా వివిధ కారణాల చేత 11 నెలల కాలంలో టీమిండియాకు ఏడుగురు కెప్టెన్లు మారారు. 
చదవండి: టీమిండియా ఇంగ్లండ్‌కు.. కేఎల్‌ రాహుల్‌ జర్మనీకి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement