
రాంచీ : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన కోహ్లి సేన మూడో వన్డేలో మాత్రం చతికిలపడింది. ఆసీస్ నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 281 పరుగులకే కుప్పకూలింది. సారథి విరాట్ కోహ్లి(123) వన్ మ్యాన్ షోతో అదరగొట్టినా విజయాన్ని అందించలేకపోయాడు. చివర్లో విజయ్ శంకర్(32), రవీంద్ర జడేజా(24)లు మెరుపులు మెరిపించడంతో విజయంపై ఆశలు కలిగాయి.. కానీ చివరకు ఆసీస్‌నే విజయాన్ని వరించింది. ఆసీస్ బౌలర్లలో జంపా, కమిన్స్, రిజర్డ్‌సన్‌లు తలో మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు.
ఓపెనర్లు విఫలం.. నిరాశ పరిచిన రాయుడు
314పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ(14), ధవన్(1)లు వెంటవెంటే ఔట్ అవ్వడంతో.. 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడు(2) కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ క్రమంలో జట్టును ఆదుకునే బాధ్యతను ధోని, కోహ్లిలు తీసుకున్నారు. అయితే ఈ జోడి క్రీజులో నిలదొక్కుకున్న అనంతరం.. స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీ షాట్‌లు ఆడే ప్రయత్నంలో ధోని(26) జంపా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం జాదవ్(26) బ్యాట్‌తో మెరుపులు మెరిపించినప్పటికీ క్రీజులో ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో 98 పరుగుల వద్ద కీపర్ క్యారీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి అదే ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ దిశగా రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జంపా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ కావడంతో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment