పఠాన్‌కు తండ్రిగా ప్రమోషన్
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ ఆటగాడు, బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తాను తండ్రయినట్లు ట్విట్టర్ ద్వారా ఈ సంతోషకర విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ భార్య ఓ పండంటి మగబిడ్డకు మంగళవారం జన్మనిచ్చింది. ఇర్షాన్ తండ్రి కావడంతో వారి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇర్ఫాన్ సోదరుడు, టీమిండియా ఆటగాడు యూసఫ్ పఠాన్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేశాడు.
మా ఇంట్లోకి కొత్త పఠాన్ కు స్వాగతమంటూ పెదనాన్న అయ్యానన్న సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అయాన్, రయాన్‌లకు తమ్ముడు దొరికేశాడని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ఏడాది మొదట్లో జెడ్డాకు చెందిన మోడల్ సఫా బేగ్ తో మక్కాలో ఇర్ఫాన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. పఠాన్ సోదరులు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి ఎన్నో విజయాలు అందించారు. భారత దాయాది పాకిస్తాన్ పై టెస్టుల్లో తీసిన హ్యాట్రిక్ వికెట్లు ఇర్ఫాన్ బెస్ట్ ప్రదర్శనల్లో ఒకటని చెప్పవచ్చు. మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఇర్ఫాన్ ఎదురుచూస్తున్నాడు.