‘నంబర్‌ వన్‌’ అని నిరూపించుకుంది: పొలార్డ్‌ | Team India Showed why Number One Team In The World, Pollard | Sakshi
Sakshi News home page

‘నంబర్‌ వన్‌’ అని నిరూపించుకుంది: పొలార్డ్‌

Published Mon, Dec 23 2019 11:35 AM | Last Updated on Tue, Dec 24 2019 10:00 AM

Team India Showed why Number One Team In The World, Pollard - Sakshi

కటక్‌: టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్‌ కోల్పోయినప్పటికీ ఆ జట్టు పోరాటం మాత్రం ఆకట్టుకుంది. అసలు టీమిండియాకు విండీస్‌ పోటీ ఇస్తుందా అని భావించిన తరుణంలో కరీబియన్‌  జట్టు అంచనాలు మించి రాణించింది. విండీస్‌ ఓడినప్పటికీ అభిమానుల మనసును మాత్రం  గెలుచుకుంది. భారత్‌తో ఆదివారం జరిగిన చివరి వన్డేలో విండీస్‌ 316 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా దాన్ని కాపాడుకోలేకపోయింది. భారత్‌ జట్టు బ్యాటింగ్‌లో రాణించడంతో మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకోవడమే కాకుండా సిరీస్‌ను సైతం 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

కాగా, పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో విండీస్‌ కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌ మాట్లాడుతూ.. భారత్‌ పర్యటన తమకు ఎక్కువ  నిరాశను మిగల్చలేదనే అనుకుంటున్నానని స్పష్టం చేశాడు. ‘ మేము ఇక్కడ చాలా బాగా ఆడాం. మా కుర్రాళ్లంతా ఆకట్టుకున్నారు. మా వాళ్ల పోరాట పటిమను  చూసి గర్విస్తున్నా. ఈ  ద్వైపాక్షిక సిరీస్‌లు మమ్మల్ని ఎక్కువ నిరూత్సాహ పరచలేదు. మేము బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించాం. కాకపోతే ప్రపంచ క్రికెట్‌లో నంబర్‌ వన్‌ జట్టు ఆట ఎలా ఉంటుందో టీమిండియా చూపించింది. అత్యుత్తమ జట్టు ఎలా ఆడాలో అలాగే టీమిండియా ఆడింది. నంబర్‌ వన్‌ జట్టు అని టీమిండియా మరోసారి నిరూపించుకుంది.

భారత్‌ జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆడి సిరీస్‌లను కైవసం చేసుకుంది. భారత పర్యటన ద్వారా మా జట్టులో ఉన్నటాలెంట్‌ను మరొకసారి గుర్తించాం. ప్రత్యేకంఆ హెట్‌మెయిర్‌, పూరన్‌, హోప్‌, కాట్రెల్‌లు  విశేషంగా ఆకట్టుకున్నారు. ఇదే ప్రదర్శనను వారు రాబోవు సీజన్లలో  కూడా రిపీట్‌ చేస్తారని ఆశిస్తున్నాం. ఇరు జట్ల మధ్య ఇదొక మంచి సిరీస్‌గా మిగిలి పోవడానికి పూర్తి స్థాయిలో ప‍్రయత్నించాం.  అందులో మేము సక్సెస్‌ అయ్యామనే అనుకుంటున్నా’ అని పొలార్డ్‌ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: టీమిండియా రికార్డులు.. విశేషాలు)

ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ..‘ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. ప్రపంచ కప్‌లోనూ న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో 30 నిమిషాలను మినహాయిస్తే మిగతాదంతా గొప్పగా సాగింది. ఎప్పటికైనా ఐసీసీ ట్రోఫీలను  పొందేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. ముఖ్యంగా మా పేస్‌ దళం ఎక్కడైనా, ఎలాంటి ప్రత్యర్థినైనా ఎదుర్కొనేలా తయారైంది. భారత్‌లో స్పిన్నర్లను మించి పేసర్లు రాణించడం అనేది గొప్ప పరిణామం. రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌ను కొత్త ఆటగాళ్లే నడిపించాలి కాబట్టి ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఒత్తిడిలో ఎలా రాణిస్తారనే అంశాన్ని మేం పరీక్షిస్తున్నాం. ఈ రోజు మా ఆట సంతృప్తి కలిగించింది. మంచు ప్రభావం ఉండటంతో భాగస్వామ్యాలు నిర్మించడంపై దృష్టి సారించాం. ఇది పనిచేసింది. నేను అవుటయ్యాక ‘జడ్డూ’ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. కేవలం మూడు ఓవర్లలోనే శార్దుల్, జడేజా మ్యాచ్‌ గతిని మార్చేశారు. బయట నుంచి ఇతరులు ఆట పూర్తి చేస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది’ అని కోహ్లి పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement