టీమిండియా టార్గెట్ 261
రాంచీ: భారత్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 15.3 ఓవర్లలో 96 పరుగులు చేసిన తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి లాథమ్(39) ఔటయ్యాడు. మరో ఓపెనర్ గప్టిల్ ఈ వన్డేలో ఫామ్ లోకొచ్చాడు. గప్టిల్ హాఫ్ సెంచరీ (72, 11 ఫోర్లు)తో పాటు కెప్టెన్ విలియమ్సన్ 41 పరుగులు చేశాడు.
35 ఓవర్లలో 184/2తో పటిస్ట స్థితిలో ఉన్న కివీస్ ను టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా దెబ్బతీశాడు. రెండు వరుస ఓవర్లలో విలియమ్సన్, నీషమ్(6)ను ఔట్ చేసి పరుగుల వేగాన్ని తగ్గించాడు. ఆ తర్వాత రాస్ టేలర్ (34) పరవాలేదనిపించాడు. జట్టుస్కోరు 223 పరుగుల వద్ద ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో శాంట్నర్ 17 పరుగులు చేసి జట్టు స్కోరు పెంచేయత్నం చేశాడు. వరుస విరామాలలో వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో 300 పరుగులు చేస్తుందనుకున్న కివీస్ కేవలం 260 పరుగులు చేయగలిగింది. జస్ప్రిత్ బుమ్రా స్థానంలో జట్టులోకొచ్చిన కులకర్ణి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 7 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్, కులకర్ణి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.