
కాసేపట్లో సమవుజ్జీల సమరం
ధర్మశాల: మూడు ట్వంటీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరిగే తొలి ట్వంటీ 20 మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. సమవుజ్జీలైన ఇరు జట్లు గెలుపుతో సిరీస్ ను శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా, డు ప్లెసిస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికాలు గెలుపుపై పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే డే అండ్ నైట్ ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనబడుతోంది.
శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, ధోని, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, సురేష్ రైనాలతో టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అశ్విన్ లు టీమిండియా కీలక బౌలర్లు. దక్షిణాఫ్రికా విషయానికొస్తే ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్, జేపీ డుమినీ, డి కాక్ లు బ్యాటింగ్ కు ప్రధాన బలం. కాగా, బౌలింగ్ లో అబాట్, ఇమ్రాన్ తాహీర్ లే జట్టులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో తొలి ట్వంటీ 20 మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.