అతడి చేతిలో టీమిండియా భద్రంగా ఉంటుంది!
కప్పు సొంతం అయిన తర్వాత ఇదంతా మావాళ్ల క్రెడిట్.. కుర్రోళ్లు బాగా ఆడారు అని చెప్పడం మామూలే. కానీ, తమను దాదాపు ఓడించినంత పని చేసిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను ఆకాశానికి ఎత్తేయడం ఎక్కడైనా చూశారా? ఐపీఎల్ 9లోనే అది సాధ్యమైంది. సన్‌రైజర్స్ జట్టుకు కప్పు వచ్చిన తర్వాత ఎలాగైనా మైదానం నుంచి వెళ్లిపోవాలని కోహ్లీ ప్రయత్నించాడు. కానీ, అతడికి అది సాధ్యం కాలేదు. 973 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కప్పు సాధించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ మర్చిపోలేదు. ''కోహ్లీ తన జట్టును ముందుండి ఎలా నడిపించాడో చూడండి.. అతడో గొప్ప కెప్టెన్. రాబోయే కొన్నేళ్ల పాటు భారత భవిష్యత్తు అతడి చేతుల్లో భద్రంగా ఉంటుంది. అతడు ఈ టోర్నమెంటులో అందరికీ లక్ష్యాలు నిర్దేశించాడు'' అని కోహ్లీని వార్నర్ ప్రశంసల్లో ముంచెత్తాడు.
నిజానికి కోహ్లీ - వార్నర్ మధ్య 2014 ఆస్ట్రేలియా పర్యటనలో చాలా పెద్ద గొడవే జరిగింది. అయినా వార్నర్ మాత్రం దాన్ని మనసులో పెట్టుకోలేదు. ఐపీఎల్‌లో టాప్ క్లాస్ ఆటను రుచిచూపించిన కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని తన మనసులో మాట చెప్పాడు. ఆ మాట చెప్పగానే స్టేడియం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
ఇక తన సొంత టీమ్‌ను కూడా వార్నర్ ప్రత్యేకంగా పొగిడాడు. కెప్టెన్ వార్నర్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా పవర్‌ప్లే సమయంలో అద్భుతంగా రాణించడంతో మొదటి బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నారో అందరికీ అర్థమైంది. ఇక బంగ్లా యువ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అయితే సన్ రైజర్స్ బౌలింగ్ లైనప్‌కు పెట్టని కోటలా నిలిచాడు. ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ ఇద్దరూ తమ వయసును లెక్క చేయకుండా అద్భుతాలు చూపించారు. ఈ అంశాలన్నింటినీ కూడా వార్నర్ ప్రస్తావించాడు.