
క్రికెటర్ గా విఫలమైనా..
పట్నా: తేజస్వి యాదవ్.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ , రబ్రీదేవిల చిన్న కుమారుడు. అతనికి క్రికెట్ ఆటగాడిగా ఎదగాలని కోరిక. ఆ రకంగా ప్రయత్నాలు కూడా చేశాడు. కాగా, తేజస్వినీ యాదవ్ క్రికెటర్ గా సక్సెస్ కాలేదు. జార్ఖండ్ తరపున ఒకే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన తేజస్వీ, నాలుగు ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడాడు. అయితే అటు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లోనూ, ఇటు ట్వంటీ 20 ల్లో కూడా తేజస్వి పూర్తిగా విఫలమయ్యాడు. 2008, 2009, 2011, 2012 సంవత్సరాల్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో తేజస్వికి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో స్థానం దక్కినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్లో తేజస్వి ప్రాతినిథ్యం వహించకపోయినా.. కనీసం తన కొడుక్కి ఆటగాళ్లకు వాటర్ అందించే అవకాశం అయినా వచ్చిందని లాలూ సంతోష పడేవాడు. కుడి చేత వాటం బ్యాట్స్ మెన్ అయిన తేజస్వి క్రికెట్ కెరీర్ లో అత్యధిక స్కోరు 19. కాగా బౌలింగ్ లో అతని బెస్ట్ 1/10.
తన క్రికెట్ కెరీర్ పెద్దగా ఆకట్టుకోవడంతో తేజస్వి క్రికెట్ ఆటకు దూరం కాక తప్పలేదు. ఇదే సమయంలో రాజకీయ ఆరంగేట్రం చేయాలని భావించాడు. అందుకు తండ్రికి అనుమతినివ్వడంతో క్రికెట్ ను వదలి రాజకీయ ప్రస్తానానికి నాంది పలికాడు. ఈ క్రమంలోనే ఇటీవల బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటి చేసి గెలుపొందాడు. తాజాగా మంత్రి పదవిని కూడా చేజిక్కించుకున్నాడు. ఇంకా మూడు పదుల వయసు కూడా దాటని తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ చలవతో రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యాడు. క్రికెటర్ గా తండ్రి అంచనాలను అందుకోని తేజస్వి.. రాజకీయంగా వేసిన తొలి అడుగులోనే ఘన విజయాన్ని అందుకున్నాడు.