సాక్షి, హైదరాబాద్: వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్) లీగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ టోర్నీలో పాల్గొనే పది జిల్లాల క్రికెట్ జట్ల లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి. వివేకానంద్ ఆయా జట్ల లోగోలను ఆవిష్కరించారు. గ్రామస్థాయిలోని క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చే ఈ టోర్నమెంట్ నేటి నుంచి జరుగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొంటారు. అనంతరం జరిగే తొలి మ్యాచ్‌లో మెదక్ మావెరిక్స్‌తో రంగారెడ్డి రైజర్స్ తలపడుతుంది.
జింఖానా మైదానం, సిద్ధిపేట్ మినీ స్టేడియం, ఎంఎల్‌ఆర్ గ్రౌండ్స్, ఏఓసీ గ్రౌండ్, రాజీవ్ గాంధీ స్టేడియం వేదికలుగా ఈనెల 21 వరకు పోటీలు జరుగుతాయి. లోగో ఆవిష్కరణ కార్యక్రమం సందర్భం గా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేకానంద్ మాట్లాడుతూ బీసీసీఐ నియమ నిబంధనల ప్రకారమే టోర్నీని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయి క్రికెటర్ల మెరుగైన భవిష్యత్‌కు టీటీఎల్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యాచ్‌లను ఆదరించి టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు హనుమంత్ రెడ్డి, టీటీఎల్ డైరెక్టర్ అగమ్ రావు పాల్గొన్నారు.
టోర్నీలో మొత్తం 49 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 40 లక్షలు. విజేతకు రూ. 15 లక్షలు, రన్నరప్‌కు రూ. 7.5 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 5 లక్షలు బహుమతిగా లభిస్తాయి.
టీటీఎల్‌లో పాల్గొనే జట్లు: కాకతీయ కింగ్స్, నిజామాబాద్ నైట్స్, మెదక్ మావెరిక్స్, ఖమ్మం టైరా, కరీంనగర్ వారియర్స్, నల్లగొండ లయన్స్, ఆదిలాబాద్ టైగర్స్, మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఆర్ రాయల్స్, రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ శ్రీనిధియాన్ థండర్‌బోల్ట్స్.
Comments
Please login to add a commentAdd a comment