కరాచీ: గతేడాది అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ వరుసగా రెండు గోల్డెన్ డక్‌లతో విమర్శల పాలై జట్టుకు మరొకసారి దూరమయ్యాడు. అయితే తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు ఉమర్ అక్మల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులకు హాజరైన ఉమర్ అక్మల్. అక్కడ ఎన్‌సీఏ అకాడమీలో ఉన్న ట్రైనర్‌తో అతిగా ప్రవర్తించాడు. ఉమర్ అక్మల్‌కు ఫిట్‌నెస్ నిర్వహించే క్రమంలో ట్రైనర్‌తో వాగ్వాదానికి దిగాడు. తనకు ఎక్కడ కొవ్వుందో చూపించూ అంటూ వాదించాడు. ఒక ఫిట్‌నెస్ టెస్టు ఫెయిల్ అయిన తర్వాత సహనం కోల్పోయిన ఉమర్ అక్మల్ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఇది పీసీబీ పెద్దల దృష్టికి వెళ్లడంతో ఉమర్ అక‍్మల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తదుపరి దేశవాళీ టోర్నమెంట్ నుంచి అక్మల్‌ను నిషేధించే అవకాశాలు కనబడుతున్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న మిస్బావుల్ హక్.. ఆటగాళ్ల ఫిట్‌నెస్ టెస్టులపై సీరియస్‌గా దృష్టిసారించాడు. జూనియర్, సీనియర్ స్థాయిలో క్రికెటర్లు ఏ ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైనా అతన్ని పక్కకు పెట్టాలనే తలంపుతో ముందుకు వెళుతున్నాడు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు కూడా వర్తింప చేస్తే ఫిట్‌నెస్ ప్రమాణాలు పెరుగుతాయనే భావనలో ఉన్నాడు. ఈ క‍్రమంలోనే ఉమర్ అక్మల్‌కు ఫిట్‌నెస్ నిర్వహించగా ఫెయిల్ అయ్యాడు. దాంతో ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించే ట్రైనర్‌ను తిట్టిపోశాడు. చొక్కా విప్పి మరీ తన కొవ్వును చూపించు అంటూ బెదిరింపు చర్యలకు దిగాడు. గతంలో మికీ ఆర్థర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్ అక్మల్ పదేపదే ఫిట్‌నెస్ టెస్టుల్లో విఫలమయ్యాడు. అప్పుడు కూడా ఆర్థర్‌పై విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment