
చెన్నై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్–6లో శుభారంభం చేసింది. మంగళవారం జోన్ ‘బి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), మోసిన్ (7 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో తెలుగు టైటాన్స్ 33–28తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. ఆట ఆరంభమైన తొలి పది నిమిషాలు ఇరు జట్లు హోరాహారీగా తలపడినా ఆ తర్వాత రాహుల్ చౌదరి ధాటిగా ఆడటంతో తమిళ్ తలైవాస్ జట్టు ఆలౌటైంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 17–11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తలైవాస్ పుంజుకొని పోటీనిచ్చినా లాభం లేకపోయింది. తమిళ్ తలైవాస్ తరఫున కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో అమిత్ (6 పాయింట్లు) సత్తా చాటాడు.
జోన్ ‘ఎ’లో భాగంగా గుజరాత్ ఫార్చూన్‌జెయింట్స్, దబంగ్ ఢిల్లీల మధ్య జరిగిన మరో మ్యాచ్ 32–32తో ‘డ్రా’గా ముగిసింది. ప్రారంభంలో తడబడిన ఢిల్లీ రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకొని చివరకు మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది. ఆట ఆరంభమైన ఏడు నిమిషాల లోపే ఢిల్లీ ఆలౌటైంది. ప్రత్యర్థి చక్కటి డిఫెన్స్‌కు తోడు తమ స్వీయ తప్పిదాలతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 12–17తో వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తేరుకొని ప్రత్యర్థికి గట్టి పోటీని చ్చింది. దబంగ్ ఢిల్లీ తరఫున చంద్రన్ రంజిత్ 9 రైడ్ పాయింట్లతో చెలరేగగా... ట్యాకిల్‌లో రవీందర్ (3 పాయింట్లు) రాణించాడు. గుజరాత్ తరఫున సచిన్ 7 రైడ్ పాయింట్లతో ఆకట్టుకోగా... సునీల్ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా, తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ జట్లు తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment