
తెలుగు టైటాన్స్ జోరు కొనసాగేనా?
హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-4లో అంచనాలు మించి రాణించిన జట్టు తెలుగు టైటాన్స్. వరుస విజయాలతో దుమ్మురేపిన టైటాన్స్ ఇప్పుడు టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలించింది. ఈ సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలై టోర్నీలో వెనుకబడిన తెలుగు టైటాన్స్ .. ఆ తరువాత అధ్బుతమైన ఆట తీరుతో చెలరేగిపోయింది. ఈ టోర్నీలో ఎనిమిది విజయాలను కైవసం చేసుకున్న తెలుగు టైటాన్స్.. . రెండు మ్యాచ్లను టై చేసుకుని సెమీస్ బరిలో నిలిచింది.
ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ తో పాటు, పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టాన్లు సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి.. తొలి సెమీస్లో పట్నా పైరేట్స్తో పుణేరి పల్టాన్ తలపడుతుండగా, జైపూర్ పింక్ పాంథర్స్తో తెలుగు టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్లూ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి గం.8.00ల.కు ఆరంభం కానున్నాయి.
ఇప్పటివరకూ ప్రొ కబడ్డీ సీజన్ లో టైటిల్ ను కైవసం చేసుకోలేని తెలుగు టైటాన్స్ ఈసారి ఆ లక్ష్యం దిశగా సాగుతోంది. ప్రొ కబడ్డీ-2 సీజన్ లో భాగంగా 2015లో ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్ కు చేరిన టైటాన్స్.. గత సీజన్లో చివర్లో చతికిలబడి ఐదో స్థానానికే పరిమితమైంది. అయితే ఈ సీజన్ ఆరంభంలో టైటాన్స్ పై పెద్దగా అంచనాలు లేవు. కొంతమంది కీలక ఆటగాళ్లు వేరే జట్లుకు మారడంతో టైటాన్స్ సెమీస్ కు చేరడం కష్టంగానే కనిపించింది. కాగా, కెప్టెన్ రాహుల్ చౌదరి, సందీప్ నర్వాల్, సందీప్ ధుల్లు విశేషంగా రాణించడంతో టైటాన్స్ సులభంగానే సెమీస్ కు చేరుకుంది.
ఓవరాల్ ప్రొ కబడ్డీలో 400కు పైగా రైడింగ్ పాయింట్లు సాధించి రికార్డు సృష్టించిన రాహుల్.. ఈ సీజన్లో 123 రైడింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అత్యుత్తమ రైడర్ గా కొనసాగుతున్నాడు. మరోసారి రాణించి తన జట్టును తొలిసారి ఫైనల్ కు చేర్చాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నాడు. మరోవైపు తొలి సీజన్ లో టైటిల్ సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్.. ఈ సీజన్ లో ఎనిమిది విజయాలతో సెమీస్ కు చేరింది. అయితే లీగ్ దశలో తలో మ్యాచ్లో గెలిచిన ఇరు జట్లు సెమీస్లో మరోసారి తమ సత్తా నిరూపించుకునేందుకు సన్నద్ధమయ్యాయి.. ప్రొ కబడ్డీ టైటిల్ ను రెండోసారి తన ఖాతాలో వేసుకోవాలని జైపూర్ భావిస్తుండగా, తొలిసారి టైటిల్ ను గెలిచి తీరాలని టైటాన్స్ పట్టుదలగా ఉంది. దీంతో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది.