న్యూఢిల్లీ: ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’పై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డీకే జైన్ పంపిన నోటీసుపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఘాటుగా స్పందించాడు. బీసీసీఐ తప్పిదాల వల్లే తాజా పరిస్థితి ఉత్పన్నమైందని అతను విమర్శించాడు. తనను క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా నియమించినా... ఏనాడూ తన బాధ్యతలేమిటో స్పష్టంగా చెప్ప లేదని తన వివరణలో సచిన్ పేర్కొన్నాడు. జైన్ నోటీసుపై 13 పాయింట్లతో సచిన్ వివరణ ఇచ్చాడు. ‘నన్ను సలహా కమిటీలో నియమించిన బీసీసీఐనే ఇప్పుడు కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్‌పై వివరణ కోరుతుండటం ఆశ్చర్యకరం.
సీఏసీలో నా బాధ్యత ఏమిటో స్పష్టంగా చెప్పాలంటూ పదే పదే కోరినా బోర్డు నుంచి స్పందన లభించలేదు. ఆ కమిటీ కేవలం సలహా మాత్రమే ఇవ్వగలదు. కాబట్టి అందులో సభ్యుడినైనా, ముంబై ఇండియన్స్ జట్టు ఐకన్‌గా కొనసాగితే వచ్చే సమస్య ఏమీ లేదు. పైగా 2013లోనే నేను ముంబై ఇండియన్స్ ఐకన్‌గా ఎంపికయ్యాను. ఇది తెలిసే 2015లో బీసీసీఐ నన్ను సీఏసీలో సభ్యుడిగా ఎందుకు ఎంపిక చేసింది’ అని సచిన్ ప్రశ్నించాడు. దీనిపై బీసీసీఐ నుంచే వివరణ కోరండి’ అని ఎథిక్స్ ఆఫీసర్‌ను సచిన్ కోరాడు. రెండు దశాబ్దాలపాటు ఆటకు సేవ చేసిన తర్వాత క్రికెట్ అభివృద్ధి కోసం పని చేయడానికి ప్రయత్నిస్తే నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి రావడం తనను బాధిస్తోందని కూడా సచిన్ అన్నాడు.
19 మంది ఉండవచ్చు...
బీసీసీఐ గుర్తింపు ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో గరిష్టంగా 19 మందితో అపెక్స్ కమిటీలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం లభించనుంది. సుప్రీం కోర్టు నియమించిన సలహాదారు పీఎస్ నరసింహ ఈ మేరకు అనుమతి ఇస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో 9 మంది మాత్రమే ఉన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర సంఘాల్లో ఉండాలని సూచనలు వచ్చాయి. అయితే తమ తమ రాష్ట్రాల్లో ఓటింగ్, ఇతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను పెంచాలని వారంతా కోరారు. దాంతో ఈ సంఖ్యను 19కి పెంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment