హాకీ కోచ్ వాల్ష్ రాజీనామా
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత హాకీ జట్టు అంచనాలకు మించి రాణించేందుకు తన వంతు సహకారం అందించిన చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వాస్తవానికి బుధవారంతో ఆయన ఒప్పందం ముగియనుంది. హాకీ ఇండియా (హెచ్‌ఐ), భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్)తో ఆయనకున్న విభేదాలే ఇందుకు కారణం. కొంతకాలంగా ఆయన జట్టు నిర్ణయాల్లో, సహాయక సిబ్బందిని నియమించుకోవడంలో తన పాత్రే ఎక్కవగా ఉండాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
అయితే వీటికి సాయ్, హెచ్‌ఐ నుంచి సానుకూలత కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గత నెలలోనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే వాల్ష్ డిమాండ్ల పరిష్కారం కోసం ఓ కమిటీ ఏర్పాటైంది. ఆయన జట్టుతో పాటే ఉండేందుకు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. వాల్ష్ డిమాండ్లపై ఏర్పాటైన ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమైనా... చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. దీంతో అధికారికంగా తప్పుకుంటున్నట్టు 60 ఏళ్ల వాల్ష్ ప్రకటించారు.
అయితే రెండు రోజుల్లో మరో ప్రతిపాదనను ఆయనకు పంపి మనసు మార్చేట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘భారత్‌లో హాకీ మరింతగా అభివృద్ధి చెందేందుకు చిన్నపాటి మార్పులు చేయాలని సాయ్, ప్రభుత్వానికి ఉండడం సంతోషం. భారత జట్టుకు అద్భుత సామర్థ్యం ఉంది. ఇక వారితో నా అనుబంధం ముగిసింది. అయితే కొత్త ప్రతిపాదనపై చర్చ జరిగింది. మరో రెండు రోజుల్లోగా వివరాలు నాకు అందనున్నాయి. ఆ తర్వాత ఈ వారం చివరిలో ఏదో ఒకటి తేలనుంది.
ఈ సమస్యకు పరిష్కారం దొరకాలనే ఆశిస్తున్నాను’ అని వాల్ష్ తెలిపారు. గతంలో యూఎస్‌ఏ హాకీతో పనిచేసినప్పుడు అక్కడ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు వాల్ష్‌పై హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఆరోపించడంతో పరిస్థితి మరింత ముదిరింది. ఈ ఆరోపణలను వాల్ష్ ఖండించారు.