Terry Walsh
-
రావడానికి నేను సిద్ధం: వాల్ష్
మీ సేవలు అవసరం లేదు: హెచ్ఐ న్యూఢిల్లీ: ఓవైపు భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవిని మళ్లీ చేపట్టేందుకు టెర్రీ వాల్ష్ ఆసక్తి చూపిస్తుంటే... మరోవైపు అతని సేవలు తమకు అవసరం లేదని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. కొన్ని సమస్యలకు హెచ్ఐ ఆచరణీయ పరిష్కారాలు చూపితే చర్చలకు వస్తానని వాల్ష్ సోమవారం కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖపై సాయ్, మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతుంటే... ఆస్ట్రేలియన్ సేవలు అవసరం లేదంటూ హెచ్ఐ మంగళవారం స్పష్టం చేసింది. సాయ్ ఆమోదంతో కొత్త కోచ్‌ను తీసుకొస్తామని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు. ఈ మేరకు సాయ్ డెరైక్టర్ జనరల్ జిజీ థామ్సన్‌కు లేఖ రాశారు. వాల్ష్ ఓ గొప్ప వ్యక్తిగా తనను తాను చిత్రీకరించుకుంటున్నాడని బాత్రా విమర్శించారు. ‘ఆటగాళ్లు, చాంపియన్స్ ట్రోఫీ ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 19 నుంచి ఓ నెల పూర్తి జీతం చెల్లిస్తామని నా సమక్షంలో హైపెర్ఫార్మెన్స్ డెరైక్టర్ ఆల్టమస్ ప్రతిపాదించారు. అలాగే నాలుగు నెలల విశ్రాంతి కాలానికీ జీతం చెల్లిస్తామని సాయ్ ఆమోదం తెలిపింది. అయినప్పటికీ వాల్ష్ ఉండకుండా వెళ్లిపోయారు. ఇప్పుడేమో జట్టుపై, అధికారులపై ప్రేమ కురిపిస్తున్నారు. మీడియా ముందు హెచ్ఐని విలన్‌గా చూపెడుతున్నారు’ అని బాత్రా వివరించారు. మరోవైపు యూఎస్ హాకీలో చేసిన ఆర్థిక అవకతవకలను వాల్ష్ పరిష్కరించుకోవాలని సూచించారు. 2012లోనే ఈ సమస్యను పరిష్కరించుకున్నానని కోచ్ చెప్పడం అబద్ధమని బాత్రా ధ్వజమెత్తారు. -
టెర్రీ వాల్ష్ సేవలు ఇక చాలు: హెచ్ ఐ
న్యూఢిల్లీ: టెర్రీ వాల్ష్ సేవలు ఇక అవసరం లేదని హాకీ ఇండియా(హెచ్ ఐ) స్పష్టం చేసింది. వాల్ష్ మనసు మార్చుకుని భారత హాకీ జట్టుకు మళ్లీ కోచ్ పనిచేసేందుకు సిద్ధపడినా తాము అంగీకరించబోమని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. ఈ మేరకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ జిజి థామ్సన్ కు ఆయన లేఖ రాశారు. టెర్రీ వాల్ష్ సేవలు అవసరం లేదని, సాయ్ అనుమతితో కొత్త కోచ్ ను నియమించుకుంటామని బాత్రా పేర్కొన్నారు. హాకీ ఇండియా ఒప్పుకుంటే భారత హాకీ జట్టు కోచ్‌గా మరో సారి టెర్రీ వాల్ష్‌ను నియమించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సాయ్ ప్రకటించిన నేపథ్యంలో బాత్రా ఈ లేఖ రాశారు. -
హాకీ ఇండియా అంగీకరిస్తే...
వాల్ష్‌ను పునర్నియమిస్తామన్న ‘సాయ్’ న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కోచ్‌గా మరో సారి టెర్రీ వాల్ష్‌ను నియమించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ప్రకటించింది. అయితే ఇందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఒప్పుకోవాల్సి ఉంటుందని ‘సాయ్’ డెరైక్టర్ జనరల్ జిజి థామ్సన్ అన్నారు. ‘వాల్ష్ తో మేం అనేక అంశాల్లో చర్చలు జరిపాం. అయితే వాల్ష్ ఆర్థిక అవకతవకలపై హెచ్ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాల్ష్ మంచి కోచ్ అయినా మేం ఒక్కరమే నిర్ణయం తీసుకోలేం. అతనితో ఇబ్బంది లేదని హెచ్ఐ భావిస్తే మళ్లీ నియమించేందుకు సిద్ధం’ అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కోచ్‌గా వాల్ష్ భారీగా అవినీతికి పాల్పడ్డాడని గత వారం హెచ్ఐ అధ్యక్షుడు బాత్రా ఆరోపించారు. -
ఇక నిర్ణయం వాల్ష్దే
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవిలో కొనసాగాలో? వద్దో? తేల్చుకోవాల్సింది... టెర్రీ వాల్షేనని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పష్టం చేసింది. వాల్ష్ డిమాండ్లను కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఆమోదించారు కాబట్టి ఇక ఆస్ట్రేలియన్ తుది నిర్ణయం తీసుకోవాలని సూచింది. మరో 4, 5 రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని సాయ్ ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు సాయ్ పంపే తాజా ప్రతిపాదనలను అధ్యయనం చేసేందుకు రెండు రోజుల సమయం కోరిన వాల్ష్... చాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టుతో కలుస్తానని చెప్పి ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే తాము ఎలాంటి ప్రతిపాదనలను పంపబోమని, వాల్ష్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని సాయ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (టీమ్స్) సుధీర్ సేతీ తెలిపారు. -
హాకీ కోచ్ వాల్ష్ రాజీనామా
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత హాకీ జట్టు అంచనాలకు మించి రాణించేందుకు తన వంతు సహకారం అందించిన చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వాస్తవానికి బుధవారంతో ఆయన ఒప్పందం ముగియనుంది. హాకీ ఇండియా (హెచ్ఐ), భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్)తో ఆయనకున్న విభేదాలే ఇందుకు కారణం. కొంతకాలంగా ఆయన జట్టు నిర్ణయాల్లో, సహాయక సిబ్బందిని నియమించుకోవడంలో తన పాత్రే ఎక్కవగా ఉండాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే వీటికి సాయ్, హెచ్ఐ నుంచి సానుకూలత కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గత నెలలోనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే వాల్ష్ డిమాండ్ల పరిష్కారం కోసం ఓ కమిటీ ఏర్పాటైంది. ఆయన జట్టుతో పాటే ఉండేందుకు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. వాల్ష్ డిమాండ్లపై ఏర్పాటైన ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమైనా... చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. దీంతో అధికారికంగా తప్పుకుంటున్నట్టు 60 ఏళ్ల వాల్ష్ ప్రకటించారు. అయితే రెండు రోజుల్లో మరో ప్రతిపాదనను ఆయనకు పంపి మనసు మార్చేట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘భారత్‌లో హాకీ మరింతగా అభివృద్ధి చెందేందుకు చిన్నపాటి మార్పులు చేయాలని సాయ్, ప్రభుత్వానికి ఉండడం సంతోషం. భారత జట్టుకు అద్భుత సామర్థ్యం ఉంది. ఇక వారితో నా అనుబంధం ముగిసింది. అయితే కొత్త ప్రతిపాదనపై చర్చ జరిగింది. మరో రెండు రోజుల్లోగా వివరాలు నాకు అందనున్నాయి. ఆ తర్వాత ఈ వారం చివరిలో ఏదో ఒకటి తేలనుంది. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలనే ఆశిస్తున్నాను’ అని వాల్ష్ తెలిపారు. గతంలో యూఎస్ఏ హాకీతో పనిచేసినప్పుడు అక్కడ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు వాల్ష్‌పై హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఆరోపించడంతో పరిస్థితి మరింత ముదిరింది. ఈ ఆరోపణలను వాల్ష్ ఖండించారు. -
వైదొలగిన టెర్రీ వాల్ష్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ మంగళవారం రాజీనామా చేశారు. తన కాంట్రాక్టుపై స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), హాకీ ఇండియాతో జరిగిన చర్చలు విఫలం కావడంతో కోచ్ పదవిని వాల్ష్ వదులుకున్నారు. ఆయన కాంట్రాక్టు రేపటితో ముగియనుంది. గత నెల 19నే వాల్ష్ రాజీనామా సమర్పించి తర్వాత మనసు మార్చుకున్నారు. తన నియమ నిబంధనలకు లోబడి కొత్త ఒప్పందం కుదుర్చుకుంటే పదవిలో కొనసాగే విషయాన్ని పునఃపరిశీలిస్తానని వాల్ష్ ఇంతకుముందు ప్రకటించారు. అయితే చర్చలు విఫలం కావడంతో కోచ్ పదవి నుంచి వాల్ష్ వైదొలగారు. -
వాల్ష్ వైదొలిగితే హాకీ ఇండియాకు కష్టాలు తప్పవు!
న్యూఢిల్లీ:హాకీ ఇండియా చీఫ్ కోచ్ గా ఉన్న టెర్రీ వాల్ష్ బాధ్యతల నుంచి తప్పుకుంటే జట్టు కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హాకీ ఇండియా పాలనా అధికారి రోలెంట్ ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే తాను వైదొలుగుతానని వాల్ష్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆల్ట్‌మన్ పై విధంగా స్పందించారు. 2016 రియోలో జరిగే ఒలింపిక్స్ కు వాల్స్ కోచ్ గా ఉంటే హాకీ ఇండియాకు మేలు జరుగుతుందన్నాడు. ఒకవేళ వాల్ష్ వెళ్లిపోతే మాత్రమ కష్టాలు తప్పవని స్పష్టం చేశాడు. ఈ మధ్య దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత జట్టు స్వర్ణం సాధించి 16 ఏళ్ల చరిత్రను తిరరాసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే తాను ఏమిటో వాల్ష్ నిరూపించుకున్నాడని, తదుపరి ఒలింపిక్స్ కు అతను చీఫ్ కోచ్ గా లేకపోతే ఎఫెక్ట్ తప్పదని హెచ్చరించాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే కోచ్ పదవిలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వాల్ష్ భవితవ్యంపై ఈనెల 17న నిర్ణయం తీసుకోనున్నారు. -
17న వాల్ష్‌పై నిర్ణయం
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ భవితవ్యంపై ఈనెల 17న నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం సమావేశమైన ముగ్గురు సభ్యుల కమిటీ ఆయన చేసిన డిమాండ్లను పరిశీలించినా తుది నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో సోమవారం మరోసారి చర్చించాలని నిర్ణయించుకుంది. మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్, అశోక్ కుమార్, జాఫర్ ఇక్బాల్‌ల బృందం వాల్ష్తో పాటు హై ఫెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఆల్ట్‌మన్, ‘సాయ్’ అధికారులతో కలిసి మూడు గంటల పాటు చర్చలు జరిపారు. హాకీ ఇండియా అధికారులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు తన డిమాండ్లను నెరవేర్చకపోతే కోచ్ పదవిలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వాల్ష్... భారత్‌లో క్రీడా పరిపాలన వ్యవస్థ బాగాలేదని విమర్శించారు. -
మనసు మార్చుకున్న టెర్రీ వాల్ష్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కోచ్ గా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నారు. ఆయనతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, కోచ్ గా కొనసాగేందుకు ఆయన అంగీకరించారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) డీజీ జీజీ థామ్సన్ తెలిపారు. ఇదే విషయాన్ని టెర్రీ వాల్ష్ కూడా సూచనప్రాయంగా వెల్లడించారు. సాయ్ తో నెలకొన్న చెల్లింపుల వివాదం కారణంగా టెర్రీ వాల్ష్ మంగళవారం కోచ్ పదవికి రాజీనామా చేశారు. దేశ క్రీడలకు సంబంధించి అత్యున్నత స్థాయి అధికారుల నిర్ణయాధికార శైలి తనకు ఇబ్బందిగా ఉందని రాజీనామా సందర్భంగా 60 ఏళ్ల వాల్ష్ వెల్లడించారు. -
హాకీ కోచ్ వాల్ష్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తన పదవికి రాజీనామా చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో నెలకొన్న చెల్లింపుల వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తానికి మూడు వారాల కిందట ఆసియా గేమ్స్‌లో జట్టుకు స్వర్ణం అందించిన ఆయన నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి తప్పుకున్నారు. ఒప్పందం ప్రకారం 2016 రియో ఒలింపిక్స్ వరకు వాల్ష్ ఈ పదవిలో కొనసాగొచ్చు. అయితే దేశ క్రీడలకు సంబంధించి అత్యున్నత స్థాయి అధికారుల నిర్ణయాధికార శైలి తనకు ఇబ్బందిగా ఉందని రాజీనామా సందర్భంగా 60 ఏళ్ల వాల్ష్ వెల్లడించారు. ‘చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశా. క్రీడల్లో నిర్ణయాలు తీసుకునే అధికారుల వ్యవహార శైలి నాకు సరిపడటం లేదు. దీర్ఘకాలంలో భారత హాకీకి, ఆటగాళ్లకు ఇది మేలు చేస్తుందని నేను భావించడం లేదు’ అని కోచ్ పేర్కొన్నారు. మరోవైపు వాల్ష్తో పాటు మరికొంత మంది సహాయక సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాలలో ప్రభుత్వం టాక్స్‌ను కట్ చేయడంతో ఈ వివాదం మొదలైందని హాకీ వర్గాల సమాచారం. రాజీనామా ఆమోదం వాల్ష్ రాజీనామాను ఆమోదించామని సాయ్ డెరైక్టర్ జనరల్ జిజీ థామ్సన్ వెల్లడించారు. కోచ్ రాజీనామాకు టీడీఎస్ వివాదం కారణం కాదని, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా నిర్వాకం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ‘వాల్ష్ అద్భుతమైన కోచ్. ఆయన ప్రదర్శనపై మేం సంతృప్తిగా ఉన్నాం. రాజీనామాకు కారణంగా వాల్ష్ అధికారులపై ఆరోపణలు చేశారు. కానీ ఇందులో హెచ్ఐ పాత్ర అధికంగా ఉంది. కోచ్‌కు మాకు సంబంధాలు పెద్దగా ఉండవు. కేవలం మేం నెలకు 16 వేల డాలర్ల జీతం మాత్రమే ఇస్తాం. మిగతా విషయాలన్నీ హెచ్ఐ చూసుకుంటుంది కాబట్టి వాళ్లే దీనికి కారణం’ అని థామ్సన్ వ్యాఖ్యానించారు. అయితే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి వాల్ష్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని సాయ్ డీజీ తెలిపారు. మరోవైపు వాల్ష్ రాజీనామా అంశంపై 24 గంటల్లో తనకు నివేదిక ఇవ్వాలని క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ అధికారులను ఆదేశించారు. రాజీనామా తర్వాత కోచ్ పదవిలో కొనసాగే ఆసక్తి లేదని చెప్పిన వాల్ష్ ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గారు. తన నియమ నిబంధనలకు లోబడి కొత్త ఒప్పందం కుదుర్చుకుంటే పదవిలో కొనసాగే విషయాన్ని పునః పరిశీలిస్తానని సంకేతాలిచ్చారు. సాయ్తో నెలకొన్న సమస్క పరిష్కారమై వాల్ష్ కోచ్ పదవిలో కొనసాగుతాడని హెచ్ఐ హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రొలెంట్ ఆల్టమస్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇండియన్ హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా కోచ్ టెర్రీ వాల్ష్ తన పదవికి రాజీనామా చేశారు. పారితోషికం విషయంలో హాకీ ఇండియాతో చోటు చేసుకున్న విభేదాలతో వాల్ష్ రాజీనామాకు సిద్ధమైయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్ గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే భారత హాకీ జట్టు కోచ్ గా నియమితులైయ్యారు. నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవం ఉన్న వాల్ష్ ను హాకీ కోచ్ గా ప్రవేశపెట్టిన అనంతరం భారత్ హాకీ మెరుగైన ఫలితాలను సాధించింది. తాజాగా దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకోవడంలో కూడా వాల్ష్ పాత్ర కొనియాడకుండా ఉండలేం. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం హాకీ ఇండియాతో పేమెంట్ల వ్యవహారంలో చోటు చేసుకున్న విభేదాలే అతని రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు.త్వరలో రియో ఒలింపిక్స్ లో కూడా హాకీ ఇండియా ఆశించిన ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో వాల్ష్ రాజీనామా బాట పట్టారు. -
భారత హాకీ కోచ్‌గా వాల్ష్
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్‌ను భారత హాకీ జట్టు కోచ్‌గా నియమించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) మంగళవారం ప్రకటించింది. ఆయనకు నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవముంది. కెరీర్ అనంతరం కోచ్‌గాను విశేష అనుభవజ్ఞుడైన వాల్ష్ భారత సీనియర్ పురుషుల జట్టుకు సేవలందిస్తారని హెచ్ఐ కార్యదర్శి నరీందర్ బాత్రా తెలిపారు. తదుపరి కీలకమైన టోర్నీల దృష్టా టీమిండియాను ఆయన గాడిన పెడతారనే విశ్వాసాన్ని బాత్రా వెలిబుచ్చారు. వరల్డ్ లీగ్ రౌండ్-4తో పాటు తదుపరి చాంపియన్స్ ట్రోఫీ వరకు భారత్ మూడు ప్రధాన ఈవెంట్లలో పాల్గొననుంది. ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో టీమిండియా తలపడనుంది. భారత జట్టుతో కలిసి పనిచేసే అవకాశం లభించడం పట్ల వాల్ష్ సంతోషం వ్యక్తం చేశారు. 1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు.