రావడానికి నేను సిద్ధం: వాల్ష్
మీ సేవలు అవసరం లేదు: హెచ్‌ఐ
న్యూఢిల్లీ: ఓవైపు భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవిని మళ్లీ చేపట్టేందుకు టెర్రీ వాల్ష్ ఆసక్తి చూపిస్తుంటే... మరోవైపు అతని సేవలు తమకు అవసరం లేదని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. కొన్ని సమస్యలకు హెచ్‌ఐ ఆచరణీయ పరిష్కారాలు చూపితే చర్చలకు వస్తానని వాల్ష్ సోమవారం కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖపై సాయ్, మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతుంటే... ఆస్ట్రేలియన్ సేవలు అవసరం లేదంటూ హెచ్‌ఐ మంగళవారం స్పష్టం చేసింది.
సాయ్ ఆమోదంతో కొత్త కోచ్‌ను తీసుకొస్తామని హెచ్‌ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు. ఈ మేరకు సాయ్ డెరైక్టర్ జనరల్ జిజీ థామ్సన్‌కు లేఖ రాశారు. వాల్ష్ ఓ గొప్ప వ్యక్తిగా తనను తాను చిత్రీకరించుకుంటున్నాడని బాత్రా విమర్శించారు. ‘ఆటగాళ్లు, చాంపియన్స్ ట్రోఫీ ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 19 నుంచి ఓ నెల పూర్తి జీతం చెల్లిస్తామని నా సమక్షంలో హైపెర్ఫార్మెన్స్ డెరైక్టర్ ఆల్టమస్ ప్రతిపాదించారు. అలాగే నాలుగు నెలల విశ్రాంతి కాలానికీ జీతం చెల్లిస్తామని సాయ్ ఆమోదం తెలిపింది. అయినప్పటికీ వాల్ష్ ఉండకుండా వెళ్లిపోయారు.
ఇప్పుడేమో జట్టుపై, అధికారులపై ప్రేమ కురిపిస్తున్నారు. మీడియా ముందు హెచ్‌ఐని విలన్‌గా చూపెడుతున్నారు’ అని బాత్రా వివరించారు. మరోవైపు యూఎస్ హాకీలో చేసిన ఆర్థిక అవకతవకలను వాల్ష్ పరిష్కరించుకోవాలని సూచించారు. 2012లోనే ఈ సమస్యను పరిష్కరించుకున్నానని కోచ్ చెప్పడం అబద్ధమని బాత్రా ధ్వజమెత్తారు.