ఇండియన్ హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా కోచ్ టెర్రీ వాల్ష్ తన పదవికి రాజీనామా చేశారు. పారితోషికం విషయంలో హాకీ ఇండియాతో చోటు చేసుకున్న విభేదాలతో వాల్ష్ రాజీనామాకు సిద్ధమైయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్ గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే భారత హాకీ జట్టు కోచ్ గా నియమితులైయ్యారు. నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవం ఉన్న వాల్ష్ ను హాకీ కోచ్ గా ప్రవేశపెట్టిన అనంతరం భారత్ హాకీ మెరుగైన ఫలితాలను సాధించింది. తాజాగా దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకోవడంలో కూడా వాల్ష్ పాత్ర కొనియాడకుండా ఉండలేం. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.
ప్రస్తుతం హాకీ ఇండియాతో పేమెంట్ల వ్యవహారంలో చోటు చేసుకున్న విభేదాలే అతని రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు.త్వరలో రియో ఒలింపిక్స్ లో కూడా హాకీ ఇండియా ఆశించిన ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో వాల్ష్ రాజీనామా బాట పట్టారు.