రేసు గుర్రం | Tests during the all-rounder | Sakshi
Sakshi News home page

రేసు గుర్రం

Published Wed, Dec 21 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

రేసు గుర్రం

రేసు గుర్రం

దాదాపు మూడేళ్ల క్రితం భారత మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి హైదరాబాద్‌ రంజీ జట్టుకు కోచ్‌గా ఉన్నారు.

దూసుకుపోతున్న రవీంద్ర జడేజా
టెస్టుల్లో చెలరేగిన ఆల్‌రౌండర్‌
జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన వైనం


దాదాపు మూడేళ్ల క్రితం భారత మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి హైదరాబాద్‌ రంజీ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. ఆ సమయంలో భారత జట్టులో రెగ్యులర్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా చోటు ఖాయం చేసుకున్న ప్రజ్ఞాన్‌ ఓజా నిలకడగా రాణిస్తున్నాడు. అయితే అప్పటికే జడేజా ఆటను చూసిన జోషి... ‘నీ బౌలింగ్‌ను మరింత మెరుగు పర్చుకో. ఈ కుర్రాడు దూసుకొస్తున్నాడు జాగ్రత్త’ అని ఓజాను హెచ్చరించారు. కొన్నాళ్లకే అది నిజమైంది. జడేజా తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవడంతో ఓజా భారత జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. తన చివరి టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన తర్వాత కూడా ఓజా మళ్లీ టెస్టు జట్టులోకి రాలేకపోగా... జడేజా లేకుండా మన టెస్టు టీమ్‌ కనిపించని పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది.

ఆస్ట్రేలియాతో 17.45 సగటుతో 24 వికెట్లు... దక్షిణాఫ్రికాపై 10.82 సగటుతో 23 వికెట్లు... ఇంగ్లండ్‌పై 25.84 సగటుతో 26 వికెట్లు... భారత టెస్టు జట్టులోకి ఎంపికైన గత నాలుగేళ్లలో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లలో జడేజా బౌలింగ్‌ ప్రదర్శన ఇది. టెస్టు క్రికెట్‌లో మూడు అత్యుత్తమ జట్లు అనదగిన ప్రత్యర్థులపై అతను చెలరేగిపోయాడు. ఈ మూడు సిరీస్‌లలోనూ టీమిండియా సాగించిన విజయ యాత్రలో కీలక భాగమయ్యాడు. మరో ఎండ్‌లో అశ్విన్‌ గంపెడు వికెట్లు తీసినా... బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి ఆ వికెట్లు దక్కేలా చేయడంలో మళ్లీ జడేజాదే ప్రధాన పాత్ర.  

‘కచ్చితత్వం’...బౌలింగ్‌కు సంబంధించి జడేజాకు ఇటీవల ఇది పర్యాయపదంగా మారిపోయింది. తన ఓవర్లో ఆరు బంతులను కూడా తాను అనుకున్నట్లు ఒకే చోట నేరుగా వికెట్‌పైకి బౌలింగ్‌ చేయగల సత్తా జడేజాలో ఉంది. అదీ ఊహకందని వేగంతో చకచకా బంతులు విసరడంతో బ్యాట్స్‌మన్‌ కోలుకునే అవకాశం కూడా ఉండదు. ఇదే అతని బలం కూడా. ‘ప్రతీ బంతిలో వైవిధ్యం చూపించాల్సిన అవసరం లేదు. టెస్టుల్లో కచ్చితత్వమే ముఖ్యం. అలాంటి బౌలింగ్‌తో ప్రపంచంలో ఏ పిచ్‌పైనైనా అతను వికెట్లు తీయగలడు. ఇంత కచ్చితత్వంతో బంతులు వస్తుంటే ఏదో ఒక దశలో బ్యాట్స్‌మన్‌ తప్పులు చేసేస్తాడు’ అని చెన్నై టెస్టు అనంతరం జడేజా బౌలింగ్‌ను కెప్టెన్‌ కోహ్లి విశ్లేషించాడు. ఈ సిరీస్‌లో సరిగ్గా అదే జరిగింది. జడేజా రెండో ఎండ్‌లో ఒత్తిడి పెంచడం వల్లే అశ్విన్‌కూ వికెట్లు దక్కాయని కెప్టెన్‌ కూడా అంగీకరించాడు. చివరకు అశ్విన్‌కంటే 17 ఓవర్లు తక్కువే వేసి అతని కంటే (30.25) ఎంతో మెరుగైన సగటుతో కేవలం 2 వికెట్లు మాత్రమే తక్కువ తీసి విజయవంతంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌ను జడేజా ముగించాడు. స్పిన్‌ను చాలా బాగా ఆడతాడని పేరున్న మైకేల్‌ క్లార్క్‌ గత ఆస్ట్రేలియా సిరీస్‌లో ఐదు సార్లు జడేజా బౌలింగ్‌లో అవుట్‌ కాగా... భారత గడ్డపై అడుగు పెట్టక ముందు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లపై 98 సగటుతో పరుగులు చేసి, తన 243 ఇన్నింగ్స్‌ల కెరీర్‌లో 14 సార్లు మాత్రమే అలాంటి బౌలర్లకు అవుటైన కుక్, ఈ సిరీస్‌లో రవీంద్ర తంత్రానికి ఏకంగా రికార్డు స్థాయిలో ఆరుసార్లు పెవిలియన్‌ చేరాడు!

ఏ పిచ్‌ అయినా ఓకే...
జడేజా 25 టెస్టుల కెరీర్‌లో ఒక మ్యాచ్‌లో మినహా అతను వికెట్‌ తీయని టెస్టు లేదు. అయితే కేవలం పూర్తిగా స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపైనే ‘దుమ్ము రేపుతాడని’ జడేజాపై ముద్ర పడింది. గత ఏడాది భారత జట్టులో పునరాగమనానికి ముందు సొంత మైదానం రాజ్‌కోట్‌లో మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో ఆరు వరుస ఇన్నింగ్స్‌లలో అతను ఐదేసి వికెట్లు పడగొట్టడం ఈ విమర్శలను పెంచింది. చివరకు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి జడేజానే పరోక్ష కారణం అని కూడా వినిపించింది. అయితే ఈ సిరీస్‌లో అతను దానిని పటాపంచలు చేశాడు. ముఖ్యంగా చెన్నైలో ఎలాంటి సహకారం లేకుండా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించిన పిచ్‌పై సత్తా చాటాడు. నిజానికి ఐదో టెస్టుకు ముందు జడేజా అత్యుత్తమ ప్రదర్శన ప్రపంచంలోని ఫాస్టెస్ట్‌ పిచ్‌లలో ఒకటైన డర్బన్‌లో వచ్చిందంటే అతను పూర్తిగా పిచ్‌ను నమ్ముకున్న బౌలర్‌ కాదని అర్థమవుతుంది. జడేజా వద్ద పదునైన, తనకే ప్రత్యేకమైన అస్త్రాలు, దూస్రాలు లాంటివి ప్రత్యేకంగా ఏమీ లేవు. బ్యాట్స్‌మన్‌ బలహీనతను గుర్తించి దానికి అనుగుణంగా బౌలింగ్‌ చేయడమే అతనికి తెలిసిన విద్య. ఇందుకోసం అతను తీవ్రంగా సాధన చేస్తాడు. ‘జడేజా చాలా కష్టపడతాడని నాకర్థమైంది. నాకు ఇలాంటి పరాభవం కొత్త అనుభవం. నా బలహీనతను గుర్తించి అతను దానికే కట్టుబడి బౌలింగ్‌ చేయడంతో ఎదుర్కోలేకపోయాను. జడేజాను అభినందించక తప్పదు’... అతని బారిన పడ్డ కుక్‌ ఎలాంటి గాంభీర్యానికి చోటు ఇవ్వకుండా తన మనసు విప్పి చెప్పిన మాట ఇది. అతి వేగంగా రెండు నిమిషాలలోపు, వీలైతే నిమిషంన్నరకే తన ఓవర్‌ పూర్తి చేయగల నైపుణ్యం అతని సొంతం. దీని వల్ల ఓవర్‌రేట్‌ కలిసొచ్చి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండు సార్లు భారత్‌ రోజులో 90కు పైగా ఓవర్లు వేసేందుకు వీలు కల్పించింది. ఆ రెండు సందర్భాల్లోనూ ఇంగ్లండ్‌ చివరి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయి పతనం దిశగా సాగింది.

రాక్‌స్టార్‌...
ఒకప్పుడు ఐపీఎల్‌ తెచ్చిన గుర్తింపుతో వన్డే, టి20 స్పెషలిస్ట్‌గానే ముద్ర వేయించుకున్న జడేజా, ఇప్పుడు టెస్టు జట్టులో కీలక భాగంగా మారాడు. రంజీ ట్రోఫీలో ఏకంగా మూడు ట్రిపుల్‌ సెంచరీలతో కదం తొక్కిన అతని బ్యాటింగ్‌ ప్రతిభ ఇప్పుడు టెస్టుల్లోనూ జట్టుకు అదనపు బలంగా మారింది. రెండేళ్ల క్రితం లార్డ్స్‌ టెస్టులో జట్టు విజయానికి కారణమైన అర్ధసెంచరీని ఎవరూ మరచిపోలేరు. విరామం అన్నదే లేకుండా వరుసగా ఓవర్లు వేయడంతో పాటు మైదానంలో ఉరకలెత్తే ఉత్సాహం ‘జడ్డూ’ సొంతం. రజనీకాంత్‌ లెవల్లో సరదా జోక్‌లకు కేంద్రం అయి ‘సర్‌’ అంటూ సహచరులతో పిలిపించుకునే జడేజా మెరుపు ఫీల్డింగ్‌ ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పింది. చెన్నైతో చివరి టెస్టుకు ముందు జడేజా స్వల్ప గాయంతో బాధ పడ్డాడు. దాంతో మేనేజ్‌మెంట్‌ హడావిడిగా అప్పటికప్పుడు అక్షర్‌ పటేల్‌ను పిలిపించుకుంది. కానీ మ్యాచ్‌ ఆడతానని, ఆడి గెలిపిస్తానన్నట్లుగా అతను చూపించిన పట్టుదల ముందు గాయం చిన్నబోయింది. గుర్రపు స్వారీని అమితంగా ఇష్టపడే ఈ రాజ్‌పుత్‌ వీరుడు భారత్‌ తరఫున రాబోయే సిరీస్‌లలో కూడా రేసు గుర్రంలా దూసుకుపోవడం ఖాయం.

రెండో ర్యాంక్‌కు జడేజా... చెన్నై టెస్టులో పది వికెట్లు తీసిన రవీంద్ర జడేజా
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌ కావడం విశేషం. మరోవైపు అశ్విన్‌ తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. 1974 తర్వాత (బిషన్‌ సింగ్‌ బేడి, బీఎస్‌ చంద్రశేఖర్‌) ఇద్దరు భారత బౌలర్లు తొలి రెండు స్థానాల్లో నిలవడం ఇదే తొలిసారి. ఆల్‌రౌండర్‌ ర్యాంకుల్లో కూడా అశ్విన్‌ మొదటి స్థానంలో, జడేజా మూడో స్థానంలో ఉన్నారు.

‘జెవెన్‌’ అంబాసిడర్‌గా...
క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘జెవెన్‌’కు రవీంద్ర జడేజా ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. బుధవారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వివరాలు ప్రకటించారు. టెన్నిస్‌ స్టార్‌ మహేశ్‌ భూపతి ‘జెవెన్‌’ సంస్థలో భాగస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘2017లో విదేశాల్లో జరిగే సిరీస్‌లలో కూడా మా జట్టు బాగా ఆడుతుందనే విశ్వాసంతో ఉన్నా. విదేశీ గడ్డపై కేవలం పర్యాటకులుగానే మిగిలిపోతామని ఉన్న విమర్శను తొలగించేం దుకు ప్రయత్నిస్తాం’ అని అతను వ్యాఖ్యానించాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement