
వినయ్ కుమార్‌కు మందలింపు...
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఆట నాలుగో రోజు శనివారం కర్ణాటక కెప్టెన్, భారత జట్టు బౌలర్ వినయ్ కుమార్ మందలింపునకు గురయ్యాడు. అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వేసుకున్న షూస్ నిబంధనలకు అనుగుణంగా లేవని అంపైర్లు అతణ్ని హెచ్చరించారు. అయితే దానిని పట్టించుకోకుండా వినయ్ ఆట కొనసాగించే ప్రయత్నం చేశాడు. దాంతో అంపైర్లు మళ్లీ కలుగజేసుకొని మార్చాల్సిందేనని గట్టిగా చెప్పారు. వాస్తవానికి వినయ్ బ్యాటింగ్ స్పైక్స్ (హాఫ్ స్పైక్స్) వేసుకోవాల్సి ఉండగా... బౌలింగ్ స్పైక్స్ (ఫుల్ స్పైక్స్)తో బ్యాటింగ్‌కు వచ్చాడు.
పైగా బ్యాటింగ్ సమయంలో అతను క్రీజ్ నుంచి చాలా బయటికి వచ్చి నిలబడసాగాడు. అతను వేసుకున్న బౌలింగ్ స్పైక్స్ కారణంగా పిచ్ పాడయ్యే ప్రమాదం ఉంది. దాంతో అంపైర్లు కలుగజేసుకున్నారు. మూడో రోజు కూడా అతను స్టాన్స్ తీసుకున్న తీరుపై అంపైర్లు హెచ్చరించారు కూడా. చివరకు సబ్‌స్టిట్యూట్ ద్వారా షూస్ తెప్పించుకున్న వినయ్, వాటిని మార్చుకునే సమయంలో గ్లవ్స్ విసిరి కొట్టి అంపైర్లతో ఏదో అన్నాడు. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా, తాను సరిగ్గానే వేసుకున్నానని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చిందని అడగ్గా... సమాధానం చెప్పకుండా అసహనం వ్యక్తం చేశాడు.