ఐపీఎల్ లేనట్లేనా?
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారుసులు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటికే ముందస్తు షెడ్యూల్లోని ఇంగ్లండ్ జట్టు పర్యటనకు ఖర్చులు భరించలేమని తేల్చి చెప్పిన బీసీసీఐ..వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి పూర్తి సందిగ్థంలో పడింది.
ఆ లీగ్కు సంబంధించి పనిని ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ అంశాన్ని పక్కకు పెట్టింది. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియాతో బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే మాట్లాడుతూ.. అసలు వచ్చే ఏడాది ఐపీఎల్ జరుగుతుందా?లేదా?అనేది ఇంకా స్పష్టత లేదని పేర్కొనడం ఆ లీగ్ పరిస్థితి డైలమాలో పడినట్లు కనిపిస్తోంది.
'2017ఐపీఎల్ జరుగుతుందా?లేదా?అనేది ఇంకా నాకైతే తెలీదు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే వచ్చే సీజన్ ఐపీఎల్ ప్రమాదంలో పడినట్లే. ఐపీఎల్ గురించి లోధా కోరిన వివరాలను ఆ కమిటీకి తెలియజేశాం. ఇంకా దానికి సంబంధించిన పని అయితే పెండింగ్లోనే ఉంది. ఐపీఎల్ నిర్వహించడానికి తీసుకోవాల్సిన ముందస్తు పనులకు సమయం కూడా లేదు. ఏమి జరగుతుందో నాకు పూర్తిగా తెలీదు' అని అజయ్ షిర్కే పేర్కొన్నారు. దాంతో పాటు బీసీసీఐ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి చాలా దురదృష్టకరమన్నారు.