రోజర్స్
సిడ్నీ: యాషెస్ సిరీస్ ఆఖరి టెస్టులోనూ ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌లో బొక్కబోర్లా పడింది. దీంతో ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌కు మరింత చేరువైంది. కంగారు పేస్ ‘త్రయం’ వాడిని తట్టుకోలేక కుక్‌సేన టాప్ ఆర్డర్ ఘోరంగా చతికిలపడింది. ఫలితంగా శనివారం రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 58.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా క్లార్క్‌సేనకు 171 పరుగుల ఆధిక్యం లభించింది. స్టోక్స్ (47), బ్రాడ్ (30 నాటౌట్) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. రోజర్స్ (73 బ్యాటింగ్), బెయిలీ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వార్నర్ (16), వాట్సన్ (9), క్లార్క్ (6), స్మిత్ (7) అవుటయ్యారు. అండర్సన్ 2, బ్రాడ్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు 8/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. నిలకడలేని బ్యాటింగ్‌తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కుక్ (7), అండర్సన్ (7)లతో పాటు బెల్ (2), పీటర్సన్ (3) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ 23 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. అయితే స్టోక్స్, బాలెన్సీ (18) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు తీవ్రంగా పోరాడారు. జాన్సన్ వేసిన బౌన్సర్ హెల్మెట్‌కు బలంగా తాకినా... బాలెన్సీ పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. నిలకడగా ఆడతున్న ఈ జోడిని లంచ్ తర్వాత రెండో ఓవర్‌లో లియోన్ విడగొట్టాడు.
ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన బెయిర్‌స్టో (18) స్టోక్స్‌కు మంచి సహకారాన్ని అందిస్తూ కాసేపు పోరాడాడు. ఏడో వికెట్‌కు 49 పరుగులు జోడించిన తర్వాత సిడిల్ ఈ జోడిని విడదీశాడు. చివర్లో బ్రాడ్ ఫర్వాలేదనిపించినా...బోర్త్‌విక్ (0), రాన్‌కిన్ (13) విఫలం కావడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ సిరీస్‌లో కుక్‌సేన 200లోపు ఆలౌట్ కావడం ఇది ఐదోసారి. హారిస్, జాన్సన్, సిడిల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. లియోన్‌కు ఒక వికెట్ దక్కింది.