
స్టీవ్ స్మిత్ అజేయ సెంచరీ
పెర్త్: సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు బౌలర్లు శుభారంభం అందించినా... ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (191 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు; 2 సిక్స్) అజేయ శతకంతో వారి జోరుకు బ్రేకు వేశాడు. 143 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ తన అసమాన ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు.
ఫలితంగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 326 పరుగులు సాధించింది. డేవిడ్ వార్నర్ (77 బంతుల్లో 60; 8 ఫోర్లు; 1 సిక్స్), హాడిన్ (100 బంతుల్లో 55; 5 ఫోర్లు; 2 సిక్స్) అర్ధసెంచరీలతో తమ వంతు సహకారాన్ని అందించారు. స్టువర్ట్ బ్రాడ్, స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ చెరో రెండు వికెట్లు తీయగా స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం స్మిత్‌తో పాటు మిచెల్ జాన్సన్ (60 బంతుల్లో 39 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.