ఫైనల్లో సౌత్‌జోన్
సెమీస్‌లో చిత్తుగా ఓడిన ఈస్ట్‌జోన్
దులీప్ ట్రోఫీ క్రికెట్
రోహ్‌టక్: దేశవాళీ జోనల్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ మూడో రోజే ముగిసిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఇన్నింగ్స్ 118 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను చిత్తుగా ఓడించింది. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఈస్ట్‌జోన్ 23.4 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. శుక్లా (18), సౌరభ్ తివారి (13) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. శరత్‌కు 4 వికెట్లు దక్కగా, స్టువర్ట్ బిన్నీ 3 వికెట్లు తీశాడు. అంతకు ముందు గురువారం ఈస్ట్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కూడా పేలవ ప్రదర్శన కనబర్చి 84 పరుగులకే ఆలౌటైంది. సౌరభ్ తివారి (17), రాణా దత్తా (17)లదే అత్యధిక స్కోరు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా 4 వికెట్లు పడగొట్టిన బిన్నీ.. ఈస్ట్‌ను దెబ్బ తీశాడు. ప్రజ్ఞాన్ ఓజాకు 3 వికెట్లు దక్కాయి.
గంభీర్ సెంచరీ: సెంట్రల్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో నార్త్‌జోన్ కెప్టెన్ గంభీర్ (242 బంతుల్లో 167; 18 ఫోర్లు) సెంచరీ చేశాడు. నార్త్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 538 పరుగులు చేసిన సెంట్రల్‌జోన్‌కు 81 పరుగుల ఆధిక్యం లభించింది. నార్త్ బ్యాట్స్‌మెన్‌లో సెహ్వాగ్ (32), యువరాజ్ (47), రసూల్ (44) ఫర్వాలేదనిపించారు. గురువారం సెంట్రల్ బ్యాట్స్‌మన్ నమన్ ఓజా (348 బంతుల్లో 217; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు.