బంగ్లా పులిలా...
►ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం
►షకీబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
ఢాకా: సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాను తాము క్లీన్‌స్వీప్ చేస్తామన్న బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ వ్యాఖ్యలపై ఆసీస్ జట్టు సారథి స్టీవ్ స్మిత్ హేళనగా స్పందించాడు. బంగ్లాదేశ్ వంద టెస్టులాడితే పట్టుమని పదైనా గెలవలేకపోయిందన్నాడు. అన్నట్లుగానే షకీబ్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాకు శుభారంభం ఇచ్చాడు. తొలి టెస్టులో బంగ్లాదేశ్ 20 పరుగుల తేడాతో మాజీ టెస్టు నంబర్‌వన్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది. టెస్టు క్రికెట్లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అయిన షకీబ్ తన హోదాకు న్యాయం చేసే ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్‌లో 84 పరుగులు చేసిన షకీబ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు (5/68, 5/85) పడగొట్టాడు. వార్నర్ (112; 16 ఫోర్లు, 1 సిక్స్) శతకం సాధించాడు.
నాలుగు రోజు 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 109/2 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 244 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వార్నర్ 121 బంతుల్లో సెంచరీని పూర్తిచేశాడు. టెస్టుల్లో అతనికిది 19వ సెంచరీ కాగా... మిగతా బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ స్మిత్ (37), కమిన్స్ (33) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తొలి సెషన్‌లో స్మిత్ అండతో సెంచరీ పూర్తిచేసిన వార్నర్‌ను కాసేపటికే షకీబ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత స్మిత్ కూడా షకీబ్ స్పిన్‌కే చిక్కడంతో ఆసీస్ పతనం జోరందుకుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి చిట్టగాంగ్‌లో జరుగుతుంది.
► 11 భారత ఉపఖండంలో ఆడిన గత 13 టెస్టుల్లో ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌ల్లో ఓడింది. కేవలం ఒక్కటంటే ఒకటే గెలవగా... మరొకటి డ్రా అయింది.
► 10 బంగ్లాదేశ్ ఇప్పటివరకు 101 టెస్టులు ఆడి పదింటిలో గెలిచింది. బంగ్లా చేతిలో ఓడిన ఐదో దేశం ఆస్ట్రేలియా.
► 5 తమ జట్టు ఆడిన 50వ టెస్టులో పది వికెట్లు తీసిన ఐదో బౌలర్ షకీబ్. గతంలో బెయిలీ, హ్యాడ్లీ, మురళీధరన్, హర్భజన్ ఇలా చేశారు.