ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ (ఇన్‌సెట్‌లో ఓ హోటల్‌లో భారత ఆటగాళ్ల డిన్నర్)
►బంగ్లాదేశ్‌తో నేడు భారత్ వార్మప్ మ్యాచ్
►అందుబాటులో రోహిత్ శర్మ
►యువరాజ్ అనుమానమే!
లండన్: చాంపియన్స్ ట్రోఫీ అసలు సమరానికి ముందు భారత జట్టు తమ చివరి మ్యాచ్ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌తో నేడు (మంగళవారం) జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌లో కోహ్లి సేన పాల్గొంటుంది. ఆ తర్వాత వచ్చే నెల 4న పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను సాగించనుంది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన తొలి వార్మప్‌లో బౌలర్లు దాదాపు 40 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా వర్షం కారణంగా బ్యాట్స్‌మెన్‌కు మాత్రం ఫుల్ ప్రాక్టీస్ లభించలేకపోయింది. కేవలం 26 ఓవర్లపాటు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. కెప్టెన్ విరాట్ కోహ్లి చక్కటి అర్ధ సెంచరీతో రాణించగా... ధావన్ కూడా బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. అయితే నేటి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ మరింత ఎక్కువ సేపు క్రీజులో నిలిస్తే పాక్‌తో మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లే అవకాశం ఉంటుంది. తుది జట్టులో ఎవరెవరిని తీసుకోవాలనే విషయంలో టీమ్ మేనేజిమెంట్ ఈ మ్యాచ్ ద్వారా ఓ అంచనాకు వచ్చే వీలుంది.
రోహిత్ శర్మ బరిలోకి...
వ్యక్తిగత కారణాలతో స్వదేశంలోనే ఉండిపోయిన రోహిత్ శర్మ శనివారం సాయంత్రం జట్టుతో చేరాడు. అయితే తొలి వార్మప్‌లో అతను బరిలోకి దిగలేదు. నాలుగేళ్ల క్రితం జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచేందుకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ధావన్ ఆట కీలకంగా మారింది. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న ధోని... రోహిత్‌ను ఓపెనర్‌గా పంపి మంచి ఫలితం సాధించాడు. అయితే గాయం కారణంగా ఇటీవలే రోహిత్ ఐదు నెలల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఆడినా ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు అలవాటు పడాల్సిన అవసరం ఉంది. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు ముందు తగిన ప్రాక్టీస్ కోసం రోహిత్ సిద్ధమవుతున్నాడు. ఓపెనర్‌గా రహానే తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కోహ్లి చక్కటి షాట్లతో అలరించగా మ్యాచ్ ఆగిపోయేంత వరకు ధోని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసాడు.
అయితే అస్వస్థతతో ఉన్న యువరాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగానే ఉంది. ఇక కివీస్‌ను 189 పరుగులకే ఆలౌట్ చేసిన బౌలింగ్ విభాగం ఫుల్ జోష్‌లో ఉంది. పేస్ ద్వయం షమీ, భువనేశ్వర్ ఫామ్‌లో ఉండగా ఉమేశ్, బుమ్రా కూడా ఈ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. మరోవైపు వన్డే ఫార్మాట్‌లో గణనీయంగా మెరుగుపడిన బంగ్లాదేశ్ జట్టుకు పాకిస్తాన్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 341 పరుగుల భారీ స్కోరు చేసినా ఓడిపోయింది.
మధ్యాహ్నం గం. 2.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం