అంత వీజీ కాదు
ఒలింపిక్స్ నిర్వహణ ఓ పెద్ద తలనొప్పి
అంచనాలను మించుతున్న ఖర్చు
క్రీడల తర్వాత ఆర్థిక సంక్షోభం
ఒకరిని మించి మరొకరు... ఒకరితో పోటీ పడి మరొకరు... నాలుగేళ్ల తర్వాత ఈ మాత్రం ఖర్చు పెరగదా అన్నట్లుగా ప్రతీ సారి కొండలా పెరిగిపోతున్న బడ్జెట్... ఒలింపిక్స్‌కు బిడ్ వేసిన నాటినుంచి క్రీడలు నిర్వహించే వరకు ప్రతీ చోటా అతి. అడగడుగునా హంగూ, ఆర్భాటం... వీటికి తోడు పారదర్శకత లేకపోవడం, అవినీతితో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ ఆయా నగరాలకు తలకు మించిన భారంగా మారుతోంది. బిడ్ సమయంలో కనిపించిన ఉత్సాహం, క్రీడలు ముగిశాక ఆవేదనగా మారుతోంది. ఒలింపిక్స్ నిర్వహించిన నగరాలు, దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. గతంలో నగరాలు ఈవెంట్ ముగిశాక లెక్కా పద్దులపై ఆందోళన చెందితే... ఇప్పుడు రియో పోటీలకు ముందే గుండెలు బాదుకుంటోంది. బ్రెజిల్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో క్రీడల నిర్వహణ దేశానికి మరింత భారంగా మారి, అది ఆందోళనగా రూపాంతరం చెందింది.
సాక్షి క్రీడా విభాగం ‘మాకొద్దీ ఒలింపిక్స్... అదేమైనా మా జీవితాలు మారుస్తుందా, మా నగరానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు చాలు, కొత్తగా వచ్చేదేమీ లేదు, పర్యాటకులు రాకపోయినా పర్వాలేదు’... ఇదేదో అభివృద్ధి చెందుతున్న దేశమో, ఆర్థికంగా గొప్పగా లేని దేశంనుంచో వస్తున్న మాట కాదు. అమెరికాలోని బ్రిస్టల్, జర్మనీ నగరం హాంబర్గ్, నార్వే (ఓస్లో), స్వీడన్ (స్టాక్‌హోం) దేశాలు... గత కొన్నేళ్లలో ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఆరంభంలో పోటీ పడి ఆ తర్వాత మా వల్ల కాదంటూ ముందే చేతులెత్తేశాయి. ఇవన్నీ ఓటింగ్ ద్వారా ప్రజల అభిప్రాయం తెలుసుకొని మరీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. తమ నగరంలో జరుగుతున్నాయని పక్షం రోజుల సంబరం తప్ప దాని వల్ల ఎలాంటి లాభమూ లేదని, తర్వాతి కాలంలో మరింత సమస్యలు వస్తాయని వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. 2012 లండన్ ఒలింపిక్స్ నిర్వహణ అంచనా వ్యయం 2.4 బిలియన్ పౌండ్లు అయితే ముగిసే సరికి అసలు ఖర్చు 8.92 బిలియన్ పౌండ్లుగా తేలడం ఆయా దేశాలను భయపెట్టేసింది.
బ్రెజిల్ అత్యుత్సాహం
‘మా దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అసలు నిరుద్యోగం అనేదే లేదు. రియో సముద్ర తీరంలో పెద్ద మొత్తంలో కొత్తగా బయటపడ్డ ఆయిల్ నిక్షేపాలతో మా ఆదాయానికి తిరుగు లేదు. ఇప్పటికే ఫుట్‌బాల్ ప్రపంచ కప్ హక్కులు దక్కించుకున్నాం. ఇక ఒలింపిక్స్‌తో మా కీర్తి మరింత పెరుగుతుంది. మేం బాగా నిర్వహించగలమనే నమ్మకం ఉంది’... 2009లో రియోకు ఒలింపిక్స్ కేటాయించినప్పుడు ఐఓసీ ముందు బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు మెరెలెస్ చేసిన భారీ ఉపన్యాసం ఇది. 2016 ఒలింపిక్స్ నిర్వహణ కోసం 2009లో బిడ్డింగ్ జరిగింది. ప్రాథమిక వడపోతలో చికాగో, టోక్యో తప్పుకోగా, మాడ్రిడ్‌తో పోటీ పడి రియో డి జనీరో అవకాశం దక్కించుకుంది. నాడు కోపకబానా బీచ్‌లోకి వచ్చి భారీగా సంబరాలు చేసుకున్న జనం ఇప్పుడు భోరుమంటున్నారు.
మారిన సీన్
గత ఏడేళ్లలో బ్రెజిల్‌లో పరిస్థితి బాగా మారిపోయింది. ఒక్కసారిగా ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టు ముట్టింది. 1990 తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దేశాధ్యక్షుడిపై తిరుగుబాటు జరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతంలో ఎన్నడూ నామమాత్రంగా కూడా లేని మౌలిక సౌకర్యాలను కల్పించే ప్రయత్నంలో భారీగా డబ్బు ఖర్చు చేశారు. విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండే రియో నగరంలో నిరంతర విద్యుత్ కోసం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. పైగా వీటి కాంట్రాక్ట్‌ల విషయంలో అవినీతి అమితంగా పెరిగిపోయింది. ఫలితంగా ప్రజల్లో ఒలింపిక్స్ సెంటిమెంట్ తగ్గిపోవడంతో పాటు అసహనం పెరిగింది. దాంతో జనం రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ర్యాలీలు చేయడం మొదలు పెట్టారు. ఒలింపిక్స్ తేదీలు ఇంత దగ్గరగా వచ్చినా నిధుల లేమి కారణంగా ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. అయితే బ్రెజిల్ అధికారులు, ఐఓసీ మాత్రం అంతా బాగుందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
ఐఓసీ అత్యాశ
ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా చూసేవారి కన్నా టీవీ రేటింగ్‌ల వల్ల వచ్చే ఆదాయమే భారీగా ఉంటుంది. ఈ మెగా ఈవెంట్‌కు ఉండే క్రేజ్ వల్ల ఇది ఎలాగూ తగ్గదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జేబులోకే ఇదంతా వెళుతుంది. ఐఓసీ అథ్లెట్లకు డబ్బులు చెల్లించదు. తమ ఆదాయాన్ని సభ్య దేశాలతో పంచుకోదు. అథ్లెట్లను పంపినందుకు కూడా ఆయా దేశాలకు ఏమీ ఇవ్వదు. మౌలిక సౌకర్యాల కల్పన గానీ, ప్రాధమిక పెట్టుబడి కానీ ఏమీ పెట్టదు. చివరకు పన్నులు కూడా చెల్లించదు. రూపాయి ఖర్చు లేకుండా తమ నియంత్రణ ఉండాలని కోరుకుంటుంది. పైగా ఐఓసీ అవినీతికి అడ్డాగా మారడం కూడా నిర్వహణా వ్యయాన్ని పెంచేస్తోంది. బిడ్డింగ్ చేయడం, ఆ తర్వాత దానికి ప్రచారం కల్పించడం భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఇక హక్కులు దక్కించుకున్న నగరానికి ప్రతీ సారి నిబంధనలు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సరిపోదు, ఇంకా బాగుండాలి అంటూ సవాలక్ష ఒత్తిడులు. దేనికీ సంతృప్తి చెందకుండా వంకలు పెట్టడంతో మరింత బాగా చేయాలంటూ ఆతిథ్య దేశాలు ఇబ్బందుల్లో పడిపోతున్నాయి. ఒలింపిక్స్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు కొత్త నగరాల కోసం చూస్తున్నామంటూ ఐఓసీ చెప్పే మాటలు బూటకమే. ఇలాంటి స్థితిలో మున్ముందు ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఏ దేశమైనా ముందుకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే రియోలో ఒలింపిక్స్ జరిగిపోవచ్చు కానీ నిర్వహణ అనంతర పరిణామాల గురించి ఆలోచన వస్తేనే ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు.