
లోపాలను అధిగమిస్తేనే నిలకడ సాధ్యం
ప్రతీ క్రికెటర్‌కు లోపాలనేవి సహజమని, వాటిని అధిగమిస్తేనే అత్యున్నత స్థాయిలో నిలకడను ప్రదర్శించగలడని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు.
అదే నా విజయరహస్యం
స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: ప్రతీ క్రికెటర్‌కు లోపాలనేవి సహజమని, వాటిని అధిగమిస్తేనే అత్యున్నత స్థాయిలో నిలకడను ప్రదర్శించగలడని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. గతేడాది ఈ స్టార్ బ్యాట్స్‌మన్ మైదానంలో పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. టెస్టుల్లో 1,215 పరుగులు చేయగా... ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 2,500కు పైగా పరుగులు సాధించాడు. ఇదంతా తన ఆటతీరును మరింత అర్థం చేసుకోవడంతోనే సాధ్యమైందని అన్నాడు. ‘గతంకన్నా భిన్నంగా నా ఆటను అన్ని కోణాల్లో అవగాహన చేసుకున్నాను. ఆ సామర్థ్యం నాకున్నందుకు సంతోషంగా ఉంది. లోపాలను సరిచూసుకోవడంతో పాటు నా బలమేమిటో కూడా అర్థం చేసుకున్నాను. అయితే నాలో ఎలాంటి లోపాలు లేవని అభిమానులు భావిస్తారు.
కానీ అది సరికాదు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. అయితే వాటిని గుర్తించగలిగితేనే నిలకడ సాధ్యమవుతుంది. అందుకే టెస్టుల్లో నేను భారీగా పరుగులు సాధించాను. ఈ విషయంలో నేను ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను ప్రేరణగా తీసుకున్నాను. కొన్నేళ్లుగా తను అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదంతా కఠిన శ్రమ ద్వారానే సాధ్యమైంది’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో కోహ్లి పేర్కొన్నాడు. మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలవడం ఇష్టమని చెప్పాడు. అలాంటి పరిస్థితికి తలొగ్గితే అపజయం మనల్ని వెంటాడుతుందని అన్నాడు.