యువరాజ్ సింగ్
ఒక క్రికెటర్ గొప్పగా పునరాగమనం ఎలా చేయొచ్చో చెప్పడానికి ఉదాహరణగా యువరాజ్ గురించి చెప్పుకున్నాం. క్యాన్సర్‌ను జయించి తిరిగి భారత జట్టులోకి వచ్చి నాణ్యమైన ఇన్నింగ్స్‌తో వహ్‌వా అనిపించాడు. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. వరుస వైఫల్యాలతో మళ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాక్షి క్రీడావిభాగం
డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కెరీర్ మళ్లీ డోలాయమానంలో పడింది. త్వరలో జరిగే న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువరాజ్‌కు స్థానం లభించకపోవడంతో అతని కెరీర్ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అనే చర్చ మొదలైంది. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల తరహాలోనే యువరాజ్ కూడా కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన 32 ఏళ్ల ఈ పంజాబ్ క్రికెటర్ విన్యాసాలు వచ్చే ఏడాది ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో కనిపించే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.
టెస్టుల్లో అవకాశం లేనట్లే
దిగ్గజ క్రికెటర్ల నీడలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువరాజ్ కెరీర్‌కు తాజా పరిణామం పెద్ద దెబ్బలాంటిదే. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌లతో టెస్టు జట్టులోని మిడిల్ ఆర్డర్‌లో ఏర్పడిన ఖాళీలోనూ ఈ స్టార్ బ్యాట్స్‌మన్ భర్తీకాలేకపోయాడు. ఇటీవల కాలంలో చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్యా రహానేలాంటి యువ క్రికెటర్లు రాణిస్తున్నతీరు చూస్తోంటే యువరాజ్‌కు టెస్టు ద్వారాలు మూసుకుపోయినట్టే.
కలిసొచ్చిన ఫార్మాట్లలో వైఫల్యం
కళ్ల చెదిరే బ్యాటింగ్, సమయోచిత స్పిన్ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో వన్డే, టి20 క్రికెట్‌లో యువరాజ్ ఒక శక్తిగా ఎదిగాడు. క్యాన్సర్ బారిన పడటంతో యువరాజ్ కెరీర్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. పట్టుదలతో పోరాడి క్యాన్సర్‌ను జయించిన అతను జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే అతని ఆటతీరులో ఒకప్పటి పదును లోపించింది. 2012 డిసెంబరు నుంచి 2013 డిసెంబరు మధ్యకాలంలో యువరాజ్ తాను ఆడిన 19 వన్డేల్లో కేవలం రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో, ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లలో వైఫల్యం అతనికి చాంపియన్స్ ట్రోఫీలో స్థానం లేకుండా చేసింది.
యువరాజ్ గైర్హాజరీలో భారత్ చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకోవడంతో అతను జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చోటు పోయిందనే బాధను పక్కనపెట్టి శారీరక, మానసిక ధృడత్వం కోసం యువరాజ్ ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అక్కడ ఆరువారాలపాటు కఠోర సాధన చేసి రీచార్జ్ అయి వచ్చాడు. సెప్టెంబరులో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన సిరీస్‌లో రాణించి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో వచ్చిన అతను వరుసగా 7, 0, 0, 12 స్కోర్లతో నిరాశపరిచాడు.
ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగో స్థానంలోకి వచ్చిన యువరాజ్ 16 నాటౌట్, 28, 55 స్కోర్లతో ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆడిన తొలి బంతికే అవుటైన యువరాజ్ రెండో వన్డేలో బరిలోకి దిగలేదు. మూడో వన్డే రద్దు కావడంతో అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. మొత్తానికి ఆస్ట్రేలియా సిరీస్‌తో పునరాగమనం చేసిన యువరాజ్ ఎనిమిది ఇన్నింగ్స్‌లో 16.85 సగటుతో కేవలం 118 పరుగులే చేశాడు. ఇందులో మూడుసార్లు ‘డకౌట్’ అయ్యాడు. ఈ వైఫల్యాల నేపథ్యంలో సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్ పర్యటనకు యువరాజ్‌ను తప్పించింది.
కిం కర్తవ్యం...
వచ్చే ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయముంది. ఈ మధ్యలో ఆసియా, టి20 ప్రపంచకప్, ఐపీఎల్, ఇంగ్లండ్ పర్యటన, దేశవాళీ వన్డే క్రికెట్‌ల రూపంలో యువరాజ్ ముంగిట పునరాగమనం కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వచ్చే రెండు నెలల్లో అవకాశాలు రాకపోయినా... ఐపీఎల్ రూపంలో ఓ అవకాశం మాత్రం సిద్ధంగా ఉంటుంది. దానిని బాగా వినియోగించుకుంటే తప్ప ప్రస్తుత పోటీలో మళ్లీ యువీ రాలేడు. అయితే ఈ స్టార్ ఆల్‌రౌండర్‌లో ఆ మునుపటి కసి ఉందా లేదా అన్నదే సందేహం.