న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విజయం
బులవాయో: సీన్ విలియమ్స్ (148 బంతుల్లో 119; 21 ఫోర్లు) సెంచరీ సాధించినప్పటికీ... న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే ఓటమిని తప్పించుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బౌలర్లు రాణించడంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. ఆదివారం 121/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే జట్టు 295 పరుగులకు ఆలౌటైంది.
విలియమ్స్, క్రెమెర్ (130 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఏడో వికెట్‌కు 118 పరుగులు జోడించి కివీస్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. విలియమ్స్ 106 బంతుల్లో సెంచరీ సాధించి జింబాబ్వే తరఫున టెస్టుల్లో వేగవంతమైన శతకం కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు, సౌతీ, వాగ్నెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 6 నుంచి జరుగుతుంది.