మళ్లీ ఆ ఇద్దరే... | The two of us again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆ ఇద్దరే...

Published Sat, Jul 11 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

మళ్లీ ఆ ఇద్దరే...

మళ్లీ ఆ ఇద్దరే...

♦ వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్, ఫెడరర్
♦ సెమీస్‌లో గాస్కే, ముర్రేలపై గెలుపు

 
 లండన్ : ఈ సీజన్‌లో అద్వితీయ ఫామ్‌లో ఉన్న రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోనూ తమ జోరు కొనసాగిస్తున్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/2), 6-4, 6-4తో 21వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై గెలుపొందగా... రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7-5, 7-5, 6-4తో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించాడు. ఆదివారం సాయంత్రం ఫైనల్ జరుగుతుంది. గతేడాది కూడా జొకోవిచ్, ఫెడరర్‌ల మధ్యనే ఫైనల్ జరిగింది. నిరుడు జొకోవిచ్ విజేతగా నిలిచాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 20-19తో ఆధిక్యంలో ఉన్నాడు.

 ‘హ్యాట్రిక్’ ఫైనల్
 గతంలో గాస్కేతో ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. మంచి ఫిట్‌నెస్‌తో ఉన్న ఈ సెర్బియా స్టార్ దూకుడు ముందు గాస్కే ఎదురునిలువలేకపోయాడు. సింగిల్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ షాట్‌లతో గాస్కే అలరించినా కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకున్నాడు. తొలి సెట్ ఆరంభంలో జొకోవిచ్ 2-0తో ముందంజ వేసినా, గాస్కే పుంజుకొని స్కోరును 4-4తో సమం చేశాడు.

ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో గాస్కే ఏకాగ్రత కోల్పోయి సెట్‌ను కోల్పోయాడు. తర్వాతి రెండు సెట్‌లలోనూ జొకోవిచ్ తన దూకుడు కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 12 ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. వింబుల్డన్‌లో జొకోవిచ్ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా మూడో ఏడాది కాగా ఓవరాల్‌గా నాలుగోసారి. 2013లో నాదల్ చేతిలో ఓడిన అతను, గతేడాది ఫెడరర్‌పై గెలిచాడు.

 26వసారి గ్రాండ్‌స్లామ్ తుదిపోరుకు...
 మాజీ చాంపియన్ ఆండీ ముర్రేతో జరిగిన మరో సెమీఫైనల్లో ఫెడరర్ కళ్లు చెదిరే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తన కెరీర్‌లో 26వసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఫెడరర్ పదునైన సర్వీస్‌లకు, గురి తప్పని రిటర్న్‌లకు, బ్యాక్‌హాండ్ షాట్‌లకు ముర్రే వద్ద సమాధానం లేకపోయింది. మొత్తం 20 ఏస్‌లు సంధించిన ఈ స్విస్ స్టార్ కేవలం ఒకే డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సెట్‌లోని 12వ గేమ్‌లో, రెండో సెట్‌లోని 12వ గేమ్‌లో, మూడో సెట్‌లోని పదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌లను ఫెడరర్ బ్రేక్ చేసి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్ ఖాతాలో మరో టైటిల్ చేరుతుందో లేదో ఆదివారం తేలుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement