‘పట్టు’ పట్టండి...
నేటి నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ బరిలో స్టార్ రెజ్లర్లు
న్యూఢిల్లీ: క్రీడాభిమానులను అలరించేందుకు మరో లీగ్ సిద్ధమైంది. క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ లీగ్‌ల సరసన తాజాగా రెజ్లింగ్ లీగ్ చేరింది. భారత్‌తోపాటు పలువురు విదేశీ స్టార్ రెజ్లర్లు బరిలో దిగుతుండగా... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)కు గురువారం తెర లేవనుంది. ఈనెల 27న ముగిసే ఈ లీగ్‌లో విజేత జట్టుకు రూ. 3 కోట్లు అందజేస్తారు. తొలి రోజున ఢిల్లీ వీర్‌తో పంజాబ్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ రెండు జట్లతోపాటు హరియాణా హ్యామర్స్, ఉత్తరప్రదేశ్ వారియర్స్, బెంగళూరు యోధాస్, ముంబై గరుడ జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి.
భారత స్టార్ రెజ్లర్లు యోగేశ్వర్ దత్, అమిత్ దహియా హరియాణా జట్టులో, సుశీల్ కుమార్ ఉత్తరప్రదేశ్ జట్టులో, నర్సింగ్ యాదవ్, బజరంగ్ బెంగళూరు జట్టులో ఉన్నారు. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ప్రతి జట్టులో ఐదుగురు పురుష రెజ్లర్లు, నలుగురు మహిళా రెజ్లర్లు ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లో తొమ్మిది బౌట్‌లు ఉంటాయి. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఉత్తరప్రదేశ్ వారియర్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు.
ఢిల్లీ వీర్ ్ఠ పంజాబ్ రాయల్స్
నేటి రాత్రి గం. 7.00 నుంచి
సోనీ మ్యాక్స్, సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం.