
ఆస్టిన్ (అమెరికా): భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఈ ఏడాదిని స్వర్ణ పతకంతో ముగించాడు. అమెరికాలోని ఆస్టిన్ నగరంలో జరిగిన ఫ్లో రెజ్లింగ్ ఇన్విటేషనల్ అంతర్జాతీయ క్లబ్ టోర్నీలో బజరంగ్ విజేతగా నిలిచాడు. 68 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ హరియాణా రెజ్లర్ అజేయంగా నిలిచాడు. ఎనిమిది మంది రెజ్లర్ల మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ ఈవెంట్‌లో బజరంగ్ బరిలోకి దిగిన మూడు బౌట్‌లలో గెలుపొందాడు. ముందుగా క్వార్టర్ ఫైనల్లో 6–1తో ప్యాట్ లుగో (అమెరికా)పై నెగ్గిన బజరంగ్... సెమీఫైనల్లో 9–0తో ఆంథోనీ యాష్‌నాల్ట్ (అమెరికా)ను ఓడించాడు.
ఫైనల్లో బజరంగ్ 8–4తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్షిప్ పతక విజేత జేమ్స్ గ్రీన్ (అమెరికా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్ ముగిసేసరికి ఇద్దరూ 4–4తో సమఉజ్జీగా ఉండగా... రెండో రౌండ్‌లో బజరంగ్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా నాలుగు పాయింట్లు గెలిచాడు. విజేతగా నిలిచిన బజరంగ్‌కు 25 వేల డాలర్లు (రూ. 18 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది. బజరంగ్ రెగ్యులర్‌గా 65 కేజీల విభాగంలో... జేమ్స్ గ్రీన్ 70 కేజీల విభాగాల్లో పోటీపడతారు. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment