భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ను ఉద్దేశించి ఆమె బంధువు, రెజ్లర్ బజరంగ్ పునియా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ఒలింపిక్ చేజారినా.. వినేశ్ పేరుప్రతిష్టలకు వచ్చిన నష్టమేమీ లేదని.. ఇప్పటికే అందరి హృదయాల్లో చాంపియన్‌గా ఆమె స్థానం దక్కించుకుందని పేర్కొన్నాడు. పతకాన్ని మాత్రమే కోరుకునే వారు పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అంటూ వినేశ్‌ను విమర్శిస్తున్న వాళ్లకు చురకలు అంటించాడు.
ఈ మేరకు.. ‘‘ఈ అంధకారంలో నీ పతకాన్ని ఎవరో మాయం చేశారు. అయినా సరే.. నువ్వొక వజ్రంలా మెరిసిపోతున్నావు. ఈరోజు ప్రపంచమంతా నిన్ను చూస్తూ ఉంది. వరల్డ్ చాంపియన్. వినేశ్ ఫొగట్.. నువ్వు మన దేశపు కోహినూర్‌వి.
వినేశ్ ఫొగట్ అంటే వినేశ్ ఫొగట్ మాత్రమే. హిందుస్థాన్ రుస్తం-ఇ-హింద్ నువ్వు. ఎవరైతే పతకాలు కావాలని కోరుకుంటున్నారో వారు రూ. 15 చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు’’ అని బజరంగ్ పునియా ఎక్స్ వేదికగా వినేశ్ ఫొగట్ మెడల్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.
విశ్వ క్రీడల్లో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడ్డ ఈ హర్యానా సివంగి.. పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) బుధవారం తమ తీర్పును వెలువరించింది. ఇక భారత ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
కాగా మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, జపాన్‌కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన వినేశ్.. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పై విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి.. యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను 5-0తో మట్టికరిపించింది. ఫలితంగా ఒలింపిక్స్ ఫైనల్ చేరిన భారత తొలి రెజ్లర్‌గా రికార్డు నమోదు చేసింది.
అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు అనూహ్య రీతిలో వినేశ్ ఫొగట్‌పై వేటు పడింది. నిర్ణీత 50 కిలోల కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య. ఈ నేపథ్యంలో తన అనర్హత, సెమీస్ వరకు చేరిన కారణంగా సంయుక్త రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు.
అయితే పలుమార్లు తీర్పును వాయిదా వేసిన స్పోర్ట్స్ కోర్టు వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వినేశ్‌కు అభిమానులు అండగా నిలుస్తుండగా.. కొంతమంది మాత్రం బరువు పెరగటంలో తప్పంతా ఆమెదే అన్నట్లుగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బజరంగ్ పునియా వినేశ్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు.
కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వినేశ్ ఫొగట్ వారి తరఫున ఢిల్లీలో ముందుండి పోరాటం చేయగా.. బజరంగ్ సహా సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆమెకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్‌ను వ్యతిరేకించేవారు.. ఆటపై కాకుండా క్రీడేతర విషయాలపై దృష్టి పెట్టిందని.. అందుకే ఈ ఫలితమని ఆమెపై విద్వేష విషం చిమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment