దాదాపు ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ సాధించిన కాంస్య పతకం భారత రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ మళ్లీ తన పట్టు నిలబెట్టుకొని రజతం సంపాదించగా... యోగేశ్వర్ దత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని దక్కించుకొని దేశం గర్వపడేలా చేసింది. మొత్తానికి గత మూడు ఒలింపిక్స్ క్రీడల్లో భారత రెజ్లర్లు తమ ‘పట్టు’దలతో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత మల్ల యోధులపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి భారత్ తరఫున ఏడుగురు బరిలో ఉండగా... అందులో కనీసం ముగ్గురు కచ్చితంగా పతకంతో తిరిగి వస్తారని క్రీడాభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
– సాక్షి క్రీడా విభాగం
బజరంగ్ పూనియా (65 కేజీలు)
కొన్నేళ్లుగా బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్‌లో పతకంతో తిరిగి రావడం బజరంగ్ పూనియాకు అలవాటుగా మారింది. తాను పాల్గొన్న గత పది టోరీ్నలలో 27 ఏళ్ల ఈ హరియాణా రెజ్లర్ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించడం విశేషం. అయితే బజరంగ్ పోటీపడుతున్న కేటగిరిలో కనీసం ఆరేడుగురు రెజ్లర్లు పతకాలు కచ్చితంగా సాధించే సత్తాగలవారున్నారు. ఆరంభంలోనే పాయింట్లు సమర్పించుకునే బలహీనతను అధిగమించి... లెగ్ డిఫెన్స్ లోపాన్ని సరిదిద్దుకుంటే టోక్యోలో బజరంగ్ పతకంతో తిరిగి వస్తాడు. బజరంగ్‌కు టకుటో ఒటోగురో (జపాన్), రషిదోవ్ (రష్యా), తుల్గా తుముర్ (మంగోలియా), ముస్‌జుకజేవ్ (హంగేరి) నుంచి గట్టిపోటీ లభించే అవకాశాలున్నాయి.
రవి దహియా (57 కేజీలు)
రెండేళ్ల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అందరి అంచనాలను తారుమారు చేసి కాంస్య పతకం సాధించిన రవి దహియా తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో శిక్షణ పొందే రవి రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచాడు. ప్రచార్భాటాలకు దూరంగా ఉండే రవి బౌట్ ఆరంభంలో నెమ్మదిగా కదులుతాడు. బౌట్ సాగుతున్నకొద్దీ ప్రత్యర్థి బలహీనతలపై అంచనా పెంచుకొని దూకుడు పెంచుతాడు. బౌట్ మొదట్లో తడబడి పాయింట్లు కోల్పోయే బలహీనత ఉన్న రవికి ఈ విశ్వ క్రీడల్లో జవుర్ ఉగెవ్ (రష్యా), సులేమాన్ అత్లి (టరీ్క), యుకీ తకహాషి (జపాన్) గట్టిపోటీ లభించనుంది.
దీపక్ పూనియా (86 కేజీలు)
జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు నిలకడగా రాణిస్తున్న రెజ్లర్ దీపక్ పూనియా. 22 ఏళ్ల దీపక్ 2019 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి... అదే ఏడాది జరిగిన సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. గత మూడేళ్లలో దీపక్ ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు, రజతం సాధించాడు. ఎడమ చేతి వేలి గాయం కారణంగాఏడాది కాలంగా అంతర్జాతీయ టోరీ్నలకు దూరంగా ఉన్న దీపక్‌కు హసన్ యజ్దాని (ఇరాన్), డేవిడ్ మోరిస్ టేలర్ (అమెరికా), నైఫోనోవ్ (రష్యా) గట్టి ప్రత్యర్థులు. పెద్దగా అంచనాలు లేకపోవడం దీపక్‌కు కలిసివచ్చే అంశం.
వినేశ్ ఫొగాట్ (53 కేజీలు)
ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగి మోకాలి గాయంతో క్వార్టర్ ఫైనల్ బౌట్ మధ్యలోనే వైదొలిగిన వినేశ్ ఈసారి మాత్రం పతకంతో తిరిగి రావాలని పట్టుదలతో ఉంది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి టోక్యో బెర్త్‌ను ఖరారు చేసుకున్న 26 ఏళ్ల వినేశ్ 2018 ఆసియా క్రీడల్లో... 2021 ఆసియా చాంపియన్íÙప్‌లో స్వర్ణాలు సాధించింది. కౌంటర్ ఎటాక్ చేసే క్రమంలో ప్రత్యర్థులకు పాయింట్లు సమర్పించుకునే బలహీనత ఉన్న వినేశ్ దీనిని అధిగమిస్తే స్వర్ణం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ విశ్వ క్రీడల్లో జపాన్ రెజ్లర్ మాయు ముకైదా నుంచి వినేశ్‌కు ప్రమాదం పొంచి ఉంది.
సీమా బిస్లా (50 కేజీలు)
అంతర్జాతీయస్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా చివరి వరకు పోరాడేతత్వంగల సీమా బిస్లా బల్గేరియాలో జరిగిన ఒలింపిక్ ప్రపంచ క్వాలిఫయింగ్ టోరీ్నలో ఫైనల్ చేరి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. బౌట్ ఆరంభంలో వెనుకబడ్డా వెంటనే పుంజుకోగల సత్తా సీమా సొంతం. హరియాణాకు చెందిన 28 ఏళ్ల సీమాపై ఎటువంటి అంచనాలు లేకపోవడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా టోక్యోలో బరిలోకి దిగనుంది. మరియా (అజర్‌బైజాన్), యు సుసాకి (జపాన్) ఫేవరెట్స్‌గా ఉన్నారు.
అన్షు మలిక్ (57 కేజీలు)
రెజ్లింగ్ కుటుంబం నుంచి వచి్చన అన్షు మలిక్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అన్షుకు అంతర్జాతీయస్థాయిలో అనభవం లేకపోయినా ఆద్యంతం దూకుడైన ఆటతో ప్రత్యర్థులకు ఇబ్బంది పెట్టగల సత్తా సొంతం. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌గా నిలిచిన అన్షుకు రిసాకో కవాయ్ (జపాన్), ఒడునాయో ఫొలాసెడ్ (నైజీరియా), ఇరీనా కురాచ్‌కినా (బెలారస్) నుంచి గట్టిపోటీ తప్పదు.
సోనమ్ మలిక్ (62 కేజీలు)
దేశవాళీ టోరీ్నలలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ను వరుసగా నాలుగుసార్లు ఓడించిన సోనమ్ మలిక్ ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా టోక్యో బెర్త్‌ను దక్కించుకుంది. క్యాడెట్ స్థాయి నుంచి నేరుగా సీనియర్ విభాగంలో పోటీపడుతున్న సోనమ్‌కు మోకాలి గాయం వేధిస్తోంది. సాంకేతికంగా పటిష్టంగా ఉండటం... కౌంటర్ ఎటాక్‌ల ద్వారా పాయింట్లు గెలవడం సోనమ్ ప్రత్యేకత. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌గా నిలిచిన సోనమ్‌కు యుకాకో కవాయ్ (జపాన్), తినిబెకోవా (కిర్గిజిస్తాన్), తేబీ ముస్తఫా (బల్గేరియా), కేలా మిరాకిల్ (అమెరికా) నుంచి గట్టిపోటీ లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment