
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో ఆడే ఆటగాళ్లంతా విరాట్ కోహ్లి మాదిరి ఆడాలనుకోవడం సాధ్యమయ్యే విషయం కాదని శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ పేర్కొన్నాడు. తుది జట్టులో ఉండే ఆటగాళ్లు అందరూ కోహ్లిలు కాలేరని, అది ఎప్పటికీ సాధ్యం కూడా కాదన్నాడు. ఆసీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ పరాజయం కావడం ఆటలో భాగమేనని మురళీ ధరన్ చెప్పుకొచ్చాడు. కొన్ని సందర్భాల్లో గెలిస్తే, మరికొన్ని సార్లు ఓటమిని కూడా అంగీకరించాలన్నాడు. ప‍్రతీ ఒక్క జట్టు 11 మంది విరాట్ కోహ్లిలతో కానీ సచిన్ టెండూల్కర్‌లతో కానీ బ్రాడ్‌మన్‌లతో కానీ నింపాలనే అనుకుంటుందని, అది ఎప్పటికీ సాధ్యం కానేకాదన్నాడు. ప్రతీ ఒక్కరూ మ్యాచ్ విన‍్నర్ కాలేరని విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాలన‍్నాడు.
(ఇక్కడ చదవండి: పంత్‌లో ధోనిని వెతకడం ఆపండి)
‘వరల్డ్‌కప్ ముందు భారత్ జట్టు చేసే ప్రయోగాలు చాలా బాగున్నాయి. ఈ తరహా ప్రయోగాలు చేసేటప్పుడు గెలుపుతో పాటు ఓటమి కూడా ఉంటుంది. ఇక్కడ ఓపిక చాలా అవసరం. ప్రధానంగా ఫ్యాన్స్‌కు నేను చెప్పేదొక్కటే. ఓపికతో ఉండండి. అప్పుడే మీ క్రికెటర్లకు ఒత్తిడి ఉండదు. భారత ఆటగాళ్లు అమోఘంగా రాణిస్తున్నారు. దయచేసి అనవసర విమర్శలు చేసి ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకండి. ఇదొక ఆట. ఇందులో గెలుపు-ఓటములు సహజం’ అని మురళీ ధరన్ పేర్కొన్నాడు.
(ఇక్కడ చదవండి: ధోని లేకపోవడం వల్లనే ఓటమి: మాజీ క్రికెటర్)
Comments
Please login to add a commentAdd a comment