కివీస్‌దే సిరీస్
మూడో వన్డేలో ఆసీస్‌పై గెలుపు
మెరిసిన రాస్ టేలర్, బౌల్ట్
హామిల్టన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 2–0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో కివీస్ 24 పరుగుల తేడాతో నెగ్గింది. బ్యాటింగ్‌లో రాస్ టేలర్ (107; 13 ఫోర్లు) శతక్కొట్టగా, బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ (6/33) ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ బ్రౌన్లీ 63; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్క్‌నర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 257 పరుగుల వద్ద ఆలౌటైంది.
బౌల్ట్ వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. కెప్టెన్ ఫించ్ (56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెడ్ (53; 5 ఫోర్లు), స్టోయినిస్ (42) రాణించారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కివీస్ నెగ్గగా... రెండో వన్డే వర్షార్పణమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. మరోవైపు ఈ సిరీస్ ఓటమితో ఆస్ట్రేలియా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయే ప్రమాదంలో పడింది.