దాదాపు రెండున్నరేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై టెస్టుల్లో విరాట్ కోహ్లి నేతృత్వంలో భారత జట్టు జైత్రయాత్ర మొదలైంది. అప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఎనిమిది సిరీస్ విజయాలు భారత్ తన ఖాతాలో వేసుకుంది. 2015 లంక సిరీస్ నుంచి మొత్తం 29 మ్యాచ్‌లు ఆడితే 21 గెలిచి, 2 మాత్రమే ఓడింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు వేటలో భారత్ చివరి టెస్టును నెగ్గాలని పట్టుదలగా ఉంది. తాజా ఫామ్ ప్రకారం అదే జరిగితే ఆస్ట్రేలియా తర్వాత వరుసగా తొమ్మిది సిరీస్‌లు గెలిచిన జట్టుగా ఘనత సాధిస్తుంది. తొలి టెస్టులో అదృష్టవశాత్తూ పరాజయం నుంచి బయటపడి, నాగ్‌పూర్‌లో చిత్తుగా ఓడిన చండిమాల్ బృందం ఇక్కడ ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి.
న్యూఢిల్లీ: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు నుంచీ దక్షిణాఫ్రికా పేరునే జపిస్తూ వచ్చిన భారత జట్టు సఫారీ పర్యటనకు వెళ్లే ముందు చివరి సారి తమ అస్త్రశస్త్రాలను పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. కీలకమైన దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు భారత జట్టు తమ ఆఖరి టెస్టు ఆడనుంది. నేటి నుంచి ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే చివరిదైన మూడో టెస్టులో భారత్, శ్రీలంక తలపడతాయి. రెండో టెస్టులో విజయంతో సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం అయితే లేదు. అయితే ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి 2–0తో ఆధిపత్యం ప్రదర్శించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పేలవమైన ఆటతో గత మ్యాచ్‌లో తమ టెస్టు చరిత్రలోనే అతి పెద్ద పరాభవాన్ని మూటగట్టుకున్న లంక ఇక్కడైనా తమ రాత మార్చుకోవాలని భావిస్తోంది. బలాబలాలపరంగా చూస్తే నిస్సందేహంగా భారత్ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది.
ఎవరు అవుట్?
భారత తుది జట్టులో స్థానం కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. రెండో టెస్టులో జట్టులో లేని శిఖర్ ధావన్ ఇప్పుడు తిరిగొచ్చాడు. అయితే గత మ్యాచ్‌లో విజయ్ సెంచరీతో చెలరేగగా, తొలి టెస్టులో రాహుల్, ధావన్ రాణించారు. ఈ ముగ్గురిలో విజయ్ జట్టులో ఉండటం ఖాయం కాగా... మరో ఓపెనర్‌గా ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరం. అవసరమైతే నాగ్‌పూర్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మను కూడా పక్కన పెట్టి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలనే ప్రత్యామ్నాయం కూడా టీమ్ మేనేజ్‌మెంట్ ముందుంది. కోహ్లి, పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయితే ప్రధాన ఆటగాళ్లలో అందరూ సత్తా చాటగా... సిరీస్‌లో ఇప్పటి వరకు రహానే మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. వరుసగా 4, 0, 2 పరుగులు సాధించిన రహానే తన స్థాయిలో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు అతని ఆత్మవిశ్వాసం పెరగాలంటే అది తప్పనిసరి. బౌలింగ్ విషయంలో భారత్‌కు ఎలాంటి సమస్యలు లేవు. స్పిన్‌లో అశ్విన్, జడేజా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేశ్‌తో పాటు మరో పేసర్ స్థానం కోసం షమీ, ఇషాంత్ శర్మ మధ్య పోటీ ఉంది. అయితే సొంతగడ్డపై ఆడేందుకు ఇషాంత్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
సందకన్‌కు చోటు?
ఈ టూర్‌లో శ్రీలంకను బ్యాటింగ్ వైఫల్యమే తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. రెండు టెస్టుల్లో కలిపి ఆ జట్టు తరఫున ఒక బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు 67 మాత్రమే! భారీ స్కోర్లు చేయకుండా టెస్టుల్లో విజయం గురించి ఆలోచించడం కూడా అత్యాశే అవుతుంది. దురదృష్టవశాత్తూ లంక ఆటగాళ్లంతా మ్యాచ్‌ను మెరుగ్గా ఆరంభించడమో లేక అక్కడక్కడా మెరుపులతో ఆకట్టుకున్నారు తప్ప ఒక పూర్తి స్థాయి టెస్టు ఇన్నింగ్స్ వారిలో ఎవరి నుంచీ రాలేదు. కరుణరత్నే, సమరవిక్రమ ఇచ్చే ఓపెనింగ్ భాగస్వామ్యమే జట్టుకు కీలకం కానుంది. తిరిమన్నె స్థానంలో ధనంజయ డి సిల్వా రావడం ఖాయమైంది. ‘ఒక్క మ్యాచ్ అయినా బాగా ఆడు ప్లీజ్’ అన్నట్లుగా సీనియర్ సహచరుడు మాథ్యూస్‌కు కెప్టెన్ చండిమాల్ వరుసగా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాడు. ఇక్కడైనా మాథ్యూస్ తన పాత ఆటను ప్రదర్శిస్తే లంక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చండిమాల్, డిక్‌వెలా మెరుగ్గా ఆడుతుండటం సానుకూలాంశం. ఆ జట్టు తాజా పరిస్థితి నేపథ్యంలో అదనపు బ్యాట్స్‌మన్‌గా రోషన్ సిల్వాను తీసుకుంటుందా లేక ఐదుగురు బౌలర్లతో ఆడుతుందా చూడాలి. మరోవైపు గాయంతో మ్యాచ్‌కు దూరమైన హెరాత్ స్థానంలో చైనామన్ బౌలర్ లక్షణ్ సందకన్ టీమ్‌లోకి రానున్నాడు. ఇటీవల పల్లెకెలె టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ను కొంత ఇబ్బంది పెట్టిన అతనిపై లంక ఆశలు పెట్టుకుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్/ధావన్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, ఉమేశ్, ఇషాంత్/షమీ. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, మాథ్యూస్, డిక్‌వెలా, రోషన్ సిల్వా/విశ్వ ఫెర్నాండో, పెరీరా, సందకన్, లక్మల్, గమగే.
పిచ్, వాతావరణం
పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కానీ అది మరీ ప్రమాదకరంగా ఏమీ లేదు. సాధారణ వికెట్. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షంతో ఇబ్బంది లేదు కానీ తొందరగా వెలుతురు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.
30 ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత జట్టు 30 ఏళ్లుగా టెస్టు ఓడిపోలేదు. ఆఖరిసారిగా 1987లో విండీస్ చేతిలో పరాజయం పాలైంది. అప్పటి నుంచి జరిగిన 11 టెస్టుల్లో భారత్ 10 గెలవగా, ఒకటి ‘డ్రా’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment