మూడో ట్వంటీ 20 రద్దు
కోల్ కతా: దక్షిణాఫ్రికా -టీమిండియాల మూడో ట్వంటీ 20 మ్యాచ్ రద్దయ్యింది. మూడు ట్వంటీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన చివరి మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో మ్యాచ్ ను రద్దు చేయకతప్పలేదు.
మ్యాచ్ ను జరపడానికి పలుమార్లు పిచ్ ను పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇప్పటికే వరుసగా రెండు ఓటములతో సిరీస్ ను కోల్పోయిన టీమిండియా.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి కనీసం పరువు దక్కించుకోవాలని భావించినా అది సాధ్యపడలేదు. మ్యాచ్ రద్దయిన అనంతరం ప్రకటించిన అవార్డుల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమిని మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను దక్కించుకున్నాడు.